క్వాంటమ్ కంప్యూటింగ్‌లో విద్యార్థులకు నూతన అవకాశాలు – సీతంలో ఘనంగా ముగిసిన గ్లోబల్ క్యూస్కిట్ ఫాల్ ఫెస్ట్–2026

క్వాంటమ్ కంప్యూటింగ్‌లో విద్యార్థులకు నూతన అవకాశాలు – సీతంలో ఘనంగా ముగిసిన గ్లోబల్ క్యూస్కిట్ ఫాల్ ఫెస్ట్–2026

విజయనగరం, నవంబర్ 28: సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (సీతం), విజయనగరంలో ఐబీఎం క్వాంటమ్ మద్దతుతో రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ‘గ్లోబల్ క్యూస్కిట్ ఫాల్ ఫెస్ట్–2026’ శనివారం ఘనంగా ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 విద్యాసంస్థలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం లభించగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎంపికైన ఏడు సంస్థల్లో సీతం ఒకటిగా నిలవడం విశేష గుర్తింపుగా నిలిచింది.

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్య విద్యాసంస్థల కార్యదర్శి, కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాలను నిరంతరం నేర్చుకోవాలని, తద్వారా అపారమైన ఉద్యోగ, పరిశోధన, ఆవిష్కరణ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు. కొత్త సాంకేతికతలు కేవలం ఉద్యోగాలను పొందడానికే కాకుండా, కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి, దేశ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపునకు కూడా దోహదపడతాయని పేర్కొన్నారు.

“మా ఆకాంక్ష ఒక్కటే. మన విద్యార్థులు కేవలం ఉద్యోగాలు సంపాదించేవారిగా మాత్రమే కాకుండా, కొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలుగా, సాంకేతిక నిపుణులుగా, పరిశోధకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి” అని ఆమె ఆకాంక్షించారు.

గౌరవ అతిథిగా పాల్గొన్న విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL), డీఆర్‌డీఓకు చెందిన సైంటిస్ట్ ‘ఎఫ్’ శ్రీ వి.ఎఫ్. షాజీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి విశేష ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగ పరిశోధనల్లో క్వాంటమ్ టెక్నాలజీ వినియోగం పరిశోధన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు, పరిశోధన మరియు అభివృద్ధికి పట్టే కాలాన్ని (Gestation Period) తగ్గించగలదని వివరించారు. డీఆర్‌డీఓతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు నూతన సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేపట్టేందుకు, ఇంటర్న్‌షిప్‌లు చేసేందుకు ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు, ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.

రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాంకేతిక నిపుణుల ప్రసంగాలు, క్వాంటమ్ హ్యాకథాన్, క్విజ్ పోటీలు, విద్యార్థుల ప్రజెంటేషన్లు నిర్వహించారు. ఐబీఎం క్యూస్కిట్ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులకు క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ప్రాయోగిక అవగాహన కల్పించారు. హ్యాకథాన్, క్విజ్ పోటీలు, ప్రజెంటేషన్లలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి బహుమతులు అందజేశారు.

సీతం క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ (QAIC) ఆధ్వర్యంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 160 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. MNIT జైపూర్, APSCHE, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, IBM క్వాంటమ్, Qubitech Global Services, DRDO తదితర ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులు క్వాంటమ్ సాంకేతికతల భవిష్యత్తు, పరిశోధన అవకాశాలు, వివిధ రంగాల్లో వాటి అనువర్తనాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీతం డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధ్యాపకులు, నిర్వాహక బృందం, విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన అవకాశాలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సీతం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి