కోటియా కొండల్లో పోలీసుల మెరుపు దాడులు.. రూ.లక్ష విలువైన బెల్లం ఊట స్వాధీనం!

2,800 లీటర్ల బెల్లం ఊట, 3 లీటర్ల నాటుసారా పట్టివేత.. ఎన్నికల నేపథ్యంలో అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా

సాలూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం తయారీకి అడ్డుకట్ట వేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు, పార్వతీపురం సబ్ డివిజన్ డీఎస్పీ సిహెచ్.వి. శేషయ్య ఆధ్వర్యంలో సాలూరు మండలంలోని కోటియా వివాదాస్పద గ్రామాల పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

దొర్లరాడివలస, ములతాడివలస, దూలిభద్ర గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాల కోసం పోలీసులు గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ సందర్భంగా 14 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సుమారు 2,800 లీటర్ల బెల్లం ఊటతో పాటు 3 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సామగ్రి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయాన్ని గమనించిన నాటుసారా తయారీదారులు అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ శేషయ్య వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ, నిల్వ, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటుసారా తయారీ, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

ఈ తనిఖీల్లో డీఎస్పీ సిహెచ్.వి. శేషయ్య, సాలూరు సీఐ పి. రామకృష్ణ, సాలూరు రూరల్ ఎస్‌ఐ బి. రవీంద్ర రాజు, మక్కువ ఎస్‌ఐ ఎం. వెంకటరమణతో పాటు ఎస్‌టీఎఫ్‌, ఈగల్ విభాగాలకు చెందిన సుమారు 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి