బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి పెద్దపీట.. అదనపు అవకాశాలకు కూటమి భరోసా! రిజర్వేషన్లలో లోటును పార్టీ పరంగా భర్తీ చేస్తాం.. బీసీల అభ్యున్నతే ప్రభుత్వ ప్రాధాన్యం: మంత్రి సంధ్యారాణి సాలూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించడంతో పాటు, వారి ప్రాతినిధ్యం తగ్గకుండా ప్రత్యేక అవకాశాలు అందించడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. బీసీలకు సామాజిక న్యాయం అందించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని, రిజర్వేషన్ల కారణంగా అవకాశాలు తగ్గే పరిస్థితులు ఉన్నచోట పార్టీ పరంగా 34 శాతానికి పైగా ప్రాధాన్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపునకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా సగటున 28.18 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం ప్రాధాన్యం సంతరించుకుందని మంత్రి వివరించారు. కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాకుండా, బీసీ నాయకులకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు కల్పించడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నారు. బీసీలకు అవకాశాల కల్పనలో టీడీపీదే ముందడుగు బీసీల రాజకీయ ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీ గతంలోనూ ప్రాధాన్యం ఇచ్చిందని సంధ్యారాణి తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో వాటిని 34 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు తిరిగి 24 శాతానికి తగ్గాయని విమర్శించారు. బీసీలకు రాజకీయంగా మరింత బలం చేకూర్చాల్సిన సమయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వారికి నష్టం కలిగించాయని ఆరోపించారు. ప్రస్తుతం బీసీల గురించి మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, గతంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమాధానం చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. బీసీల సంక్షేమం విషయంలో ప్రకటనలకే పరిమితం కాకుండా, వారికి వాస్తవంగా ఎలాంటి అవకాశాలు కల్పించామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. రిజర్వేషన్లకు మించి ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్యలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితుల వల్ల బీసీలకు రాజకీయ అవకాశాలు తగ్గకుండా పార్టీ పరంగా అదనపు అవకాశాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం వారికి భరోసానిస్తుందని మంత్రి తెలిపారు. బీసీ వర్గాల నుంచి సమర్థులైన నాయకులను ప్రోత్సహించడం, రాజకీయ నిర్ణయాల్లో వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. బీసీల అభ్యున్నతి, రాజకీయ సాధికారత, సమాన అవకాశాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సంధ్యారాణి స్పష్టం చేశారు. బీసీ వర్గాల ప్రయోజనాలను కాపాడుతూ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. Spread the love టపా నావిగేషన్ ముత్యాలమ్మ ఆలయంలో దొంగల హల్చల్.. సాలూరులో ఒరియా పాఠశాలకు విద్యార్థుల కరువు.. బడి బలోపేతంపై కార్యాచరణ ఏదీ?