ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నగారా.. నవంబర్ 3న పోలింగ్!
రెండో సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు
సాలూరు ప్రతినిథి, అక్టోబర్ 19 :
గ్రామీణ స్థానిక సంస్థల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామీణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు వివిధ దశలకు తేదీలను ఖరారు చేశారు.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21న ఎన్నికల నోటీసుల జారీతో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 23 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. అక్టోబర్ 25న అప్పీళ్ల స్వీకరణ, అక్టోబర్ 26న వాటి పరిష్కార ప్రక్రియ చేపట్టనున్నారు.
అక్టోబర్ 27న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థిత్వాల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి, ఎన్నికల గుర్తులను కేటాయించనున్నారు. దీంతో ఆయా మండలాలు, జిల్లా పరిషత్ ప్రాంతాల్లో ఎన్నికల పోరు మరింత స్పష్టతకు రానుంది.
నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైతే నవంబర్ 4న రీపోలింగ్ చేపట్టేందుకు షెడ్యూల్లో అవకాశం కల్పించారు. నవంబర్ 5న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, లెక్కింపు పూర్తయిన అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో గ్రామస్థాయిలో రాజకీయ సమీకరణాలు, అభ్యర్థుల ఎంపిక, మద్దతుదారుల కూడగట్టడం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మద్దతు ఎవరికి లభిస్తుందో, ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
