సాలూరు ఎంపీపీగా బడ్నాన జోగారావు ఏకగ్రీవ ఎన్నిక

సాలూరు ఎంపీపీగా బడ్నాన జోగారావు ఏకగ్రీవ ఎన్నిక

వైస్ ఎంపీపీగా డొంక అన్నపూర్ణకు అవకాశం.. 9 మంది టీడీపీ ఎంపీటీసీల మద్దతు

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు:

సాలూరు మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలలో టీడీపీకి చెందిన 9 మంది సభ్యులు కలిసి బడ్నాన జోగారావును ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ఎంపీపీ అభ్యర్థిగా డొంక అన్నపూర్ణకు కూడా అదే 9 మంది ఎంపీటీసీలు మద్దతు తెలిపారు.

సాలూరు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 9 స్థానాలను కైవసం చేసుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించింది.

ఎంపీపీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముందుగా బడ్నాన జోగారావుకు సంబంధించిన బి-ఫారాన్ని ఎన్నికల అధికారి బి. రమణమూర్తికి అందజేశారు. అనంతరం ఎన్నికల అధికారి బడ్నాన జోగారావు పేరును ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించి, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు.

ఈ సందర్భంగా తొమ్మిది మంది ఎంపీటీసీలు చేతులెత్తి తమ మద్దతును తెలియజేయడంతో బడ్నాన జోగారావు ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా డొంక అన్నపూర్ణకు కూడా సభ్యులు మద్దతు ప్రకటించారు.

ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా ఎన్నికైన అభ్యర్థులు మంత్రి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారి బి. రమణమూర్తి అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి