అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఉద్ఘాటన
మక్కువ మండల పీజీఆర్ఎస్ లో 83 వినతుల స్వీకరణ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమంలో అందే ప్రతి అర్జీ పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో అర్జీదారుల సంతృప్తే కొలమానంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఉద్ఘాటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం మక్కువ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలిలతో కలిసి అర్జీదారుల నుంచి వినతులను కలెక్టర్ స్వీకరించారు. అందులో భాగంగా 83 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలను కేవలం కంప్యూటర్లలో క్లోజ్ చేయడం ముఖ్యం కాదని, క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారమై అర్జీదారుడు సంతృప్తి చెందాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి వినతిని నిర్దేశించిన కాలపరిమితిలోగా పరిష్కరించాలని, కారణం లేకుండా ఏ ఒక్క అర్జీని కూడా పెండింగ్‌లో ఉంచకూడదని ఆయన ఆదేశించారు. మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సమస్యల మూలాలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. నిబంధనల మేరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
*అందిన అర్జీల వివరాలు ఇలా…*
కోదు పెద్దవలస నుంచి మండంగి మాణిక్యం వినతి పత్రాన్ని అందిస్తూ వితంతువు అయిన తనకు పింఛను మంజూరు చేయాలని కోరారు.
అనసభద్ర నుంచి రాకోటి ప్రకాష్ అర్జీని అందిస్తూ, 56 ఏళ్లు నిండిన తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని కోరారు.
మక్కువ ఎస్సీ కాలనీ నుంచి డోలా మధు అర్జీని అందిస్తూ, తన కుమారుడు మృతి చెంది వారం అయినప్పటికీ పోస్ట్ మార్టం నివేదిక ఇవ్వలేదని తెలిపారు.
రెవిన్యూ భూముల్లో చాలా ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ బోరింగువలస గ్రామస్తులు అర్జీని అందించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, మండల తహశీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు మరియు పెద్ద సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు.








