మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయండి

400 మంది విద్యార్థులకు అవగాహన కల్పించిన SSWAASA FOUNDATION

యువత ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు కృషి చేయాలి – డా. బి. అనితాజ్యోతి

విజయవాడ, నవంబర్ 28:

విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ముందస్తు అవగాహన కల్పించడమే లక్ష్యంగా SSWAASA FOUNDATION ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలోని దుర్గాపురం S.T.V.R. హైస్కూల్‌లో శనివారం (నవంబర్ 28) “Say No to Drugs” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి SSWAASA FOUNDATION వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్, ప్రముఖ సైకాలజిస్ట్ డా. బి. అనితాజ్యోతి ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. మత్తు పదార్థాల వినియోగం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని, విద్యార్థి దశలోనే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా డా. అనితాజ్యోతి మాట్లాడుతూ.. యువత మంచి స్నేహాలను ఎంచుకోవాలని, సానుకూల ఆలోచనలు, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల బారిన పడిన వారిని నిందించకుండా, వారికి మానసిక సహకారం, కౌన్సెలింగ్ అందించి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల అక్రమ వినియోగం లేదా సంబంధిత కార్యకలాపాలు పరిసరాల్లో కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

SSWAASA FOUNDATION ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన, యువతలో చైతన్యం, కౌన్సెలింగ్, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమం ద్వారా సుమారు 400 మంది విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఆరోగ్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును కాపాడుకోండి.. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి