సాలూరు అభివృద్ధికి బహుముఖ అడుగులు.. పట్టణం నుంచి గిరిజన పల్లెల వరకు ప్రగతి బాట! రూ.58 లక్షలతో మున్సిపాలిటీలో పలు పనులకు శ్రీకారం.. రూ.13 కోట్లతో రహదారి, వంతెన నిర్మాణానికి శంకుస్థాపన పసుపువానివలసలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ.. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమన్న మంత్రి సంధ్యారాణి సాలూరు: పట్టణాభివృద్ధితో పాటు గిరిజన గ్రామాల మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యమిస్తూ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సాలూరు మున్సిపాలిటీలో రూ.58 లక్షల విలువైన పనులతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారి, వంతెన నిర్మాణానికి రూ.13 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. మరోవైపు పసుపువానివలస గ్రామంలో రామమందిర నిర్మాణ పనులకు అంకురార్పణ చేశారు. పట్టణంలో మెరుగైన సదుపాయాలు సాలూరు మున్సిపాలిటీలోని ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రూ.44 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా సాలూరు పోస్టాఫీస్ వద్ద రూ.10 లక్షలతో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే 19వ వార్డు బ్రాహ్మణ వీధి, 28వ వార్డు రెడ్డిక వీధిలో రూ.1.60 లక్షల చొప్పున పైలట్ వాటర్ స్కీమ్లను ప్రారంభించారు. పట్టణంలో మౌలిక సదుపాయాలను విస్తరించి, ప్రజలకు మెరుగైన జీవన వసతులు కల్పించడమే లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పసుపువానివలసలో రామమందిర నిర్మాణానికి శ్రీకారం సాలూరు మండలం అన్నంరాజువలస పంచాయతీ పరిధిలోని పసుపువానివలస గ్రామంలో దేవాదాయ శాఖ నిధులు రూ.20 లక్షలతో నిర్మించనున్న రామమందిరానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో రామమందిరం నిర్మించుకోవాలనే ఆకాంక్ష నేటికి నెరవేరుతోందని గిరిజన గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాముడు కేవలం ఆరాధ్య దైవమే కాకుండా ప్రజలను ఐక్యంగా నిలిపే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి వేసే తొలి ఇటుక గ్రామ ఐక్యతకు పునాది కావాలని ఆకాంక్షించారు. రూ.13 కోట్లతో రహదారి, వంతెన నిర్మాణం గ్రామీణ ప్రాంతాల రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ పరిధిలోని దుగ్దసాగరం నుంచి వంగరగుడ్డివలస వరకు రహదారి, వట్టిగెడ్డ వంతెన నిర్మాణానికి రూ.13 కోట్లతో మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే గిరిజన గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరమవడంతో పాటు విద్యార్థులు, వృద్ధులు, గర్భిణులు, వ్యాపారులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గనున్నాయి. రహదారి సదుపాయం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న గ్రామాల ప్రజలు నిధులు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టినందుకు మంత్రి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణాలు, పల్లెల సమగ్ర అభివృద్ధే ధ్యేయం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా మారుమూల గిరిజన గ్రామాలకు సైతం మౌలిక సదుపాయాలు అందించడమే అభివృద్ధి పాలనకు ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రహదారులు, వెలుగులు, తాగునీరు, ప్రజావసరాల సదుపాయాల కల్పనతో సాలూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంతో పాటు గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒకే రోజు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ఈ కార్యక్రమాలు స్థానిక అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. Spread the love టపా నావిగేషన్ శంబర పోలమాంబ సన్నిధిలో గాయత్రీ దేవి అలంకారం.. పసుపు కొమ్ములతో అమ్మవారికి విశేష శోభ! సాలూరు మున్సిపల్ పీఠం.. నాలుగోసారీ మహిళకే అవకాశం!