ఆర్టీఐ పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన 1300 మంది బ్లాక్‌లిస్ట్
ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి, అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించిన శక్తివంతమైన రాజ్యాంగ ఆయుధమే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అని శ్రీకాకుళం రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ పి.ఎస్. నాయుడు స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం, అధికారులను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని కమిషన్ సహించదని ఆయన గట్టిగా హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్ముతో నడిచే ప్రభుత్వంలోని అవకతవకలు, అవినీతిని ప్రశ్నించడానికి ఆర్టీఐని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజన తర్వాత చాలా కాలంగా పేరుకుపోయిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని, ఇప్పటివరకు సుమారు 10 వేల దరఖాస్తులను క్లియర్ చేసి, సమాచారం అందించడానికి చర్యలు తీసుకున్నామని కమిషనర్ తెలిపారు.
ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాచిపెట్టే అధికారులపై సెక్షన్ 20(2) కింద శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలతో పాటు, సెక్షన్ 20(1) కింద గరిష్టంగా రూ.25 వేల జరిమానా విధిస్తున్నట్లు ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా పదేపదే నిరాధారమైన దరఖాస్తులు చేస్తూ, అధికారులను వేధిస్తున్న సుమారు 1200 నుంచి 1300 మందిని ‘ఆర్టీఐ దుర్వినియోగం’ కింద బ్లాక్‌లిస్ట్ చేసినట్లు, వారి దరఖాస్తులను తిరస్కరించాలని అన్ని శాఖల కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడైంది. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు కమిషనర్‌ను సత్కరించారు.

