వర్షం విజృంభణ.. మన్యం యంత్రాంగం ప్రతిస్పందన! వాగుల నుంచి చెరువుల దాకా నిరంతర పర్యవేక్షణ.. ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, పలు చెరువుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన జిల్లా యంత్రాంగం అప్రమత్తమై రక్షణ, సహాయక చర్యలను ముమ్మరం చేసింది. జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి కలెక్టరేట్ నుంచి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ వర్షపాతం, చెరువుల నీటిమట్టాలు, వాగుల ప్రవాహం, రహదారుల పరిస్థితిపై అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించారు. ప్రమాదం తలెత్తే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. పెరిగిన వర్షపాతం.. అప్రమత్తమైన అధికారులు జిల్లాలో సగటున 50 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సీతంపేటలో 156 మి.మీ., పాలకొండలో 103 మి.మీ., బలిజిపేటలో 86 మి.మీ., వీరఘట్టంలో 63 మి.మీ. వర్షం కురిసింది. సీతంపేట మండలంలోని చేలకన్నౌజిరి ట్యాంక్ వద్ద 81.85 మి.మీ., ఓడంకలబండ వద్ద 75.12 మి.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో నీటిమట్టాలు పెరుగుతున్న చెరువులపై నీటిపారుదల శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. 45 చెరువులపై ప్రత్యేక నిఘా జిల్లాలోని 9 మండలాల్లో 45 చెరువుల నీటిమట్టాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 28 చెరువులకు అలర్ట్, 6 చెరువులకు వార్నింగ్, 11 చెరువులకు కాషన్ స్థాయి ప్రకటించారు. బలిజిపేటలో 18, సీతంపేటలో 10, వీరఘట్టంలో 4, సాలూరులో 5, జియ్యమ్మవలసలో 2, పాలకొండలో 2, పాచిపెంటలో 1, మక్కువలో 2, సీతానగరంలో 1 చెరువు పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్లపై పడిన చెట్ల తొలగింపు ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా ప్రధాన, అంతర్గత రహదారులపై పడిన చెట్లను రెవెన్యూ, పోలీసు, ఫైర్, ఆర్అండ్బీ శాఖలు సమన్వయంతో తొలగించాయి. సమాచారం అందిన వెంటనే సిబ్బంది సంఘటనా స్థలాలకు చేరుకుని రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. పాలకొండ కార్గిల్ జంక్షన్ వద్ద చెట్టు పడిన సమాచారం అందిన వెంటనే రెవెన్యూ, రెస్క్యూ సిబ్బంది చేరుకుని తొలగింపు పనులు చేపట్టారు. సాయంత్రానికి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు ప్రమాదానికి గురికాకుండా అధికారులు రాకపోకలను నియంత్రించారు. అవసరమైన చోట్ల ముళ్లకంపలు, తాళ్లను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. గర్భిణుల తరలింపుపై ప్రత్యేక దృష్టి భారీ వర్షాల నేపథ్యంలో వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాయి. సెప్టెంబర్ 23 నుంచి 30 మధ్య ప్రసవ తేదీ ఉన్న 158 మంది గర్భిణులను గుర్తించారు. వీరిలో 75 మందిని ముందుగానే సురక్షిత వైద్య కేంద్రాలకు తరలించారు. 39 మందిని పీహెచ్‌సీలకు, నలుగురిని సీహెచ్‌సీలకు, 20 మందిని ఏరియా ఆసుపత్రులకు, 10 మందిని జిల్లా ఆసుపత్రికి, ఇద్దరిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సీతంపేట వైటీసీలో తాత్కాలిక ఆశ్రయం కల్పించి వసతి, పౌష్టికాహారం, వైద్య పరీక్షలు, మందులు అందిస్తున్నారు. విద్యుత్ అంతరాయాలపై వేగంగా స్పందన భారీ వర్షాల ప్రభావంతో జిల్లాలో 15 33 కేవీ ఫీడర్లు, 70 11 కేవీ ఫీడర్లు, 198 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు వర్షాలు తగ్గిన తర్వాత ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాయి. పలు గ్రామాల్లో డ్రెయిన్ల పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ, మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్ నిర్వహించారు. నీటి సరఫరా పథకాలను అధికారులు పరిశీలించి ఫీల్డ్ టెస్టింగ్ కిట్లతో నీటి నాణ్యతను పరీక్షించాలని ఆదేశించారు. పంట నష్టంపై అధికారుల పరిశీలన భారీ వర్షాలతో ముంపునకు గురైన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. బలిజిపేట, గరుగుబిల్లి తదితర ప్రాంతాల్లో పంట పరిస్థితిని పరిశీలించి, పొలాల్లో నీరు ఎక్కువ రోజులు నిలిచినట్లయితే నష్టాన్ని నమోదు చేస్తామని రైతులకు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అరటి తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇళ్ల గోడలు, ఇళ్లకు జరిగిన నష్టాన్ని కూడా క్షేత్రస్థాయిలో నమోదు చేస్తున్నారు. మూడు మండలాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అత్యధిక వర్షపాతం నమోదైన సీతంపేట, పాలకొండ, బలిజిపేట మండలాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. రబ్బరు బోట్లు, లైఫ్ జాకెట్లు, కటింగ్ మిషన్లు, కమ్యూనికేషన్ పరికరాలతో బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా విపత్తు సమయంలో విధులు నిర్వహించే తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్హెచ్ఓలు, విద్యుత్ శాఖ అధికారులకు ఎమర్జెన్సీ కిట్లు, రెయిన్కోట్లు, తాళ్లు, లైఫ్ జాకెట్లు అందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం కాని ప్రయాణాలను తగ్గించుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది. వాగులు, వంకలు, కల్వర్టులు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించింది. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దని సూచించింది. తాగునీటిని కాచి వడబోసిన తర్వాతే వినియోగించాలని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ లేదా 108కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో 24/7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాల పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. Spread the love టపా నావిగేషన్ వానొస్తే పారన్నవలసకు దారేది? పాఠశాలలు తెరుచుకునేలోపే.. భద్రతా చర్యలు పూర్తి చేయాలి!