గురువుల సేవకు ‘వాయిస్ ట్రస్ట్’ సెల్యూట్.. ఆదర్శ ఉపాధ్యాయులకు ఘన గౌరవం విద్యాబోధనతో పాటు సమాజ సేవ, విద్యార్థుల మార్గదర్శకత్వంలో విశేష కృషి చేసిన ముగ్గురు గురువులకు సత్కారం పార్వతీపురం మన్యం/సాలూరు ప్రతినిధి, అక్టోబర్ 5: గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదని.. విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ, సమాజానికి బాధ్యతగల పౌరులను తీర్చిదిద్దే మార్గదర్శకులని వాయిస్ ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యారంగంతో పాటు సామాజిక సేవలోనూ ప్రత్యేక ముద్ర వేసిన ముగ్గురు ఆదర్శ గురువులను వాయిస్ ట్రస్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా మహంతి రాంబాబు, డాక్టర్ రంభా రజనీకాంత్, శివలెంక ప్రసాదరావులను సత్కరించి వారి సేవలను అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా మహంతి రాంబాబు మహంతి రాంబాబు విద్యాబోధనతో పాటు పేద విద్యార్థులు, నిరుపేద కుటుంబాలకు తనవంతు సహాయాన్ని అందిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించడంతో పాటు శివరామపురం గ్రంథాలయానికి ఫర్నిచర్, విలువైన పుస్తకాలను అందించారు. పంచాలి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించి విద్యకు ప్రోత్సాహం కల్పించారు. పదో తరగతి అనంతరం విద్యార్థులు సరైన విద్యా మార్గాన్ని ఎంచుకునేందుకు మార్చి నుంచి జూలై వరకు కెరీర్ గైడెన్స్ అందిస్తూ, ఆత్మవిశ్వాసం కోల్పోయిన యువతలో మానసిక ధైర్యాన్ని పెంపొందించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణితంపై ఆసక్తిని పెంచుతున్న డాక్టర్ రజనీకాంత్ రామానుజన్ మ్యాథమెటిక్స్ క్లబ్ వ్యవస్థాపకుడిగా డాక్టర్ రంభా రజనీకాంత్ విద్యార్థుల్లో గణితంపై ఉన్న భయాన్ని తొలగిస్తూ తార్కిక ఆలోచన, ఆత్మవిశ్వాసం, ఆసక్తిని పెంపొందించేలా కృషి చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వివిధ పాఠశాలల్లో గణిత ప్రతిభా పరీక్షలు, క్విజ్‌లను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. వాయిస్ ట్రస్ట్ ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొని సంస్థ సభ్యులకు మార్గదర్శకత్వం, విలువైన సూచనలు అందించారు. వాయిస్ ట్రస్ట్ కోర్ సభ్యుల్లో పలువురు ఆయన శిష్యులే కావడం విశేషం. ప్రారంభం నుంచే మిషన్ సేఫ్ సాలూరు కార్యక్రమానికి తన సహకారం, మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు. రక్తదాన సేవలో రామ ఫౌండేషన్ విశేష కృషి రామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివలెంక ప్రసాదరావు 2008లో తన గురువు, మేనమామలు రామచంద్ర మూర్తి, రామారావుల స్మృతిలో సంస్థను స్థాపించి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందిస్తూ ఇప్పటివరకు 5,216 మంది రోగులకు రక్త సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థులు, యువతలో సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, మానవతా విలువలపై అవగాహన కల్పిస్తూ 3,500 మందికి పైగా యువతకు స్ఫూర్తినిచ్చారు. సేవను బాధ్యతగా భావిస్తూ కొనసాగిస్తున్న ఆయన కృషిని వాయిస్ ట్రస్ట్ ప్రత్యేకంగా అభినందించింది. గురువుల సేవకు గౌరవం.. సమాజానికి స్ఫూర్తి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్ నిర్మాణం, సామాజిక బాధ్యతను పెంపొందించే గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వాయిస్ ట్రస్ట్ పేర్కొంది. ఇలాంటి ఆదర్శ వ్యక్తుల సేవలను గుర్తించి సత్కరించడం ద్వారా మరింత మందిలో సేవా స్ఫూర్తిని పెంపొందించవచ్చని తెలిపింది. ఈ కార్యక్రమంలో వాయిస్ ట్రస్ట్ అధ్యక్షులు బెవర నాగార్జున మరియు వాయిస్ ట్రస్ట్ సభ్యులు శ్రావణ్ కుమార్, చింత రామకృష్ణ, కూణిశెట్టి గుప్తేష్, పైల భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు… Spread the love టపా నావిగేషన్ మోదీ జన్మదిన వేడుకలు.. విద్యార్థుల్లో ఉత్సాహం ఉరకలు యువత భవిష్యత్తుకు ఉద్యోగ బాట.. పార్వతీపురం మన్యంలో భారీ జాబ్ మేళా!