10 ప్రముఖ కంపెనీలతో ఉద్యోగ నియామకాలు.. 8న గాయత్రి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

పార్వతీపురం, అక్టోబర్ 6:
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు పార్వతీపురం మన్యంలో మంచి అవకాశం లభించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మోడల్ కెరీర్ సెంటర్–పార్వతీపురం మన్యం సౌజన్యంతో ఈ నెల 8న భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.

స్థానిక గాయత్రి డిగ్రీ కళాశాలలో గురువారం ఉదయం 11 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఈ నియామక ప్రక్రియలో టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, ఫ్లిప్‌కార్ట్, మదర్‌సన్, కియా మోటార్స్, 2050 హెల్త్‌కేర్, యంగ్ ఇండియా, హెటెరో, యాక్ట్ ఫైబర్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర 10 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి.

విద్యార్హతల విషయానికి వస్తే 8వ తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, ఎంఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళాకు హాజరుకావచ్చు. బీటెక్‌లో బ్యాక్‌లాగ్స్ ఉన్న అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులుగా పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.9,500 నుంచి రూ.35,800 వరకు వేతనం అందనుంది. వార్షికంగా రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ప్యాకేజీలు ఉండనున్నాయి. సంబంధిత కంపెనీల నిబంధనల మేరకు ఉచిత వసతి, భోజనం, రవాణా, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు వివిధ అలవెన్సులు కూడా అందించే అవకాశం ఉంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో జాబ్ మేళాకు హాజరుకావాలని జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి సిహెచ్. సుబ్బిరెడ్డి తెలిపారు. అభ్యర్థులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ ఫారం ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాన్ని సాధించాలని అధికారులు సూచించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి