ప్రశాంతయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా మెగా పల్లె నిద్ర
*- విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్*

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు, గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితులను పర్యవేక్షించేందుకు జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారి* ఆదేశాలతో ఒకే రోజున జిల్లా వ్యాప్తంగా ‘మెగా పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని అక్టోబర్ 10న నిర్వహించారు.

జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* మాట్లాడుతూ – పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో రాత్రి బస చేసి, పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజలతో సమావేశమై, ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

గ్రామాల్లో ఉన్న సమస్యలు, సున్నితమైన ప్రాంతాలు, గతంలో చోటుచేసుకున్న వివాదాలు, రాజకీయపరమైన ఘర్షణలకు ఆస్కారం ఉన్న అంశాలపై ఆరా తీసి, వాటిని ముందుగానే గుర్తించి పరిష్కారానికి పోలీసు అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు. గ్రామాల్లోని ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లొంగవద్దని, గొడవలకు దూరంగా ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు తమ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సమాజానికి, ప్రజలకు హాని కలిగించే డ్రగ్స్ కు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మహిళలు, బాలల భద్రత, రహదారి భద్రత పట్ల అవగాహన కలిగిఉండాలని, త్రిశూల్ లక్ష్యాన్ని సాధించాలని, సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని ప్రజలకు పోలీసు అధికారులు, సిబ్బంది కోరారని జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* తెలిపారు.

విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి డెంకాడ పీఎస్ పరిధిలోని కొండరాజుపేట గ్రామంలోను, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు బుదరాయవలస పీఎస్ పరిధిలో ఉత్తరావల్లి గ్రామంలోను, బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు రామభద్రపురం పీఎస్ పరిధిలో రోంపల్లి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొని, రాత్రి బస చేయగా, పలువురు సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి