జనసేన పార్టీకి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన కోట్ల కృష్ణ
చీపురుపల్లి: తన రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగుగా సాధించిన విజయానికి సహకరించిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కోట్ల కృష్ణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజును తాను **“పట్టభద్రులకు పట్టం కట్టిన రోజు”**గా అభివర్ణిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాజకీయంగా ముందుకు తీసుకెళ్లిన జనసేన పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సహచర కూటమి పార్టీలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు పార్టీలకతీతంగా తన విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ కూడా బ్యాలెట్ పత్రాల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించి తనకు మద్దతు తెలిపిన సోదరులకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
ఈ విజయం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, విద్యకు, విజ్ఞానానికి, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు ప్రజలు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి, ప్రజాసేవకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ విజయంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రజల ఆశీర్వాదమే తనకు కొండంత బలమని కోట్ల కృష్ణ తెలిపారు.
కోట్ల కృష్ణ M.Com., M.B.A., M.A., M.Phil., (Ph.D.) విద్యార్హతలు కలిగి ఉండగా, ప్రస్తుతం చీపురుపల్లి అసెంబ్లీ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా, ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్‌గా, జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
