మూడవ విడత నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు – జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్

*పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ (20.11.2026*)

💥*మూడవ విడత నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు – జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్*

💥*జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ*

జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని *జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్* గారు స్పష్టం చేశారు. మూడవ విడత నామినేషన్ల ప్రక్రియను 03 ( సాలూరు,పాచిపెంట, మక్కువ) మండలాలలో కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుండి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఎక్కడా భద్రతా లోపాలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో కూడిన బందోబస్తు ఏర్పాటు చేసి విధులు నిర్వహించాలని అధికారులకు,సిబ్బందికి సూచించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించి, నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా ప్రజలు గుమిగూడకుండా, అభ్యర్థులు మరియు వారి వెంట వచ్చే వ్యక్తులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద రద్దీని నియంత్రిస్తూ, తదుపరి జరిగే నామినేషన్ల ప్రక్రియలు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. గత ఎన్నికల సమయంలో ఘర్షణలు, వివాదాలు చోటుచేసుకున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు, అవసరమైన చోట్ల పోలీసు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు.

పంచాయితీ ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ గారు పోలీసు అధికారులకు సూచించారు. అదేవిధంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా తమ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకునేలా పటిష్ట భద్రతా, భరోసా కల్పిస్తామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి