విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా భార్యా భర్తలు విద్యుత్ షాక్ కు బలి అయ్యారు.
పొలంకి చెరువు నీటిని వదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై భార్యా భర్తలు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మీసాల పేట గ్రామానికి చెంది కోరాడ ఈశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులు . గ్రామ సమీపంలో ఉన్న తమ పొలంకు గోపీనాథ్ పట్నాయక్ చెరువు నీటిని మళ్లించేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారు. పొలంలో కింద పడి ఉన్న విద్యుత్ వైర్లను ఈశ్వరరావు పట్టుకోవడంతో అక్కడికక్కడే షాక్ కుగురై ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నాం అవుతున్నా పొలంకు వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో అతని కోసం భార్య ఆదిలక్ష్మి పొలం కి వెళ్లి చూడగా, అక్కడ పొలంలో భర్త పడి ఉండడాన్ని ఆమె గమనించింది. అతనిని పైకి లేపే ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్ షాక్ గురై అక్కడే ప్రాణాలు వీడిచింది. మృతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు బీటెక్ చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ వైర్లు గత నెల 14వ తేదీన స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలంలో పడి ఉన్నాయని లైన్మెన్ కు చెప్పిన పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి న్యాయం చేసే వరకు మృతదేహాల్ని తరలించేది లేదని స్పష్టం చేశారు.. విషయం తెలుసుకున్న ఆండ్ర ఎస్సై దేవి సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.