ఆపన్న కుటుంబానికి అండగా మాతృభూమి సేవా సంఘం.. మానవత్వమే తమ ధ్యేయమని చాటింపు!

అనారోగ్యం, కుటుంబ కష్టాలు, రోడ్డు ప్రమాదంతో ఇబ్బందులు.. నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ

విజయనగరం: ఒకవైపు అనారోగ్యం.. మరోవైపు కుటుంబంలో వరుస విషాదాలు.. జీవనోపాధికి సైతం ఆటంకం ఏర్పడటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి మాతృభూమి సేవా సంఘం అండగా నిలిచింది. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందిస్తూ సేవా స్ఫూర్తిని చాటుకుంది.

విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్న ఈ కుటుంబం జీవన పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. ఉపాధి కోసం సాలూరు నుంచి విజయనగరానికి వచ్చిన ఆ కుటుంబంలో భర్త దూరంగా ఉండటంతో కుటుంబ బాధ్యతలు తల్లిపై పడ్డాయి. ఆమె నరాల బలహీనతతో బాధపడుతుండగా, ముగ్గురు పిల్లల్లో ఒక కుమారుడు మానసిక వైకల్యంతో బాధపడుతూ 11 రోజుల క్రితం మృతి చెందాడు. మరో కుమార్తె కూడా మానసిక వైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న ఇంకో కుమార్తె ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడంతో పనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కూడా ఆ కుటుంబానికి భారంగా మారింది.

ఈ పరిస్థితిని గమనించిన సాలూరుకు చెందిన వాయిస్ ట్రస్ట్ ప్రతినిధులు బేవర నాగార్జున కుటుంబానికి సహాయం అందించేందుకు మాతృభూమి సేవా సంఘం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కుటుంబానికి దగ్గరి బంధువైన, సంఘ సభ్యుడు రాజు ద్వారా వివరాలు తెలుసుకున్న సంఘ ప్రతినిధులు సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా సంఘ సభ్యులు తాడేపల్లి నాగేశ్వరరావు, రవ్వ వెంకటేష్, ఇప్పలవలస గోపాలరావు కలిసి నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఆపదలో ఉన్నవారికి సాయం చేయడమే నిజమైన సేవ అనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న కుటుంబానికి అవసరమైన సమయంలో చేయూత అందించిన మాతృభూమి సేవా సంఘం సభ్యుల సేవా దృక్పథాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి