పిఓ, ఏపిఓలు ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి*

*పిఓ, ఏపిఓలు ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి*

*ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి*

*ప్రలోభాలకు తావివ్వొద్దు.. నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి*

*వివాదాలకు దూరంగా.. నిబంధనలకు అనుగుణంగా: పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ దిశానిర్దేశం*

*జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా ఎన్ ప్రభాకర రెడ్డి*

పార్వతీపురం, అక్టోబర్ 22 : ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు అందరూ ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా ఎన్ ప్రభాకర రెడ్డి అన్నారు. గురువారం పార్వతీపురం లైన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో మున్సిపల్ సాధారణ ఎన్నికలు – 2026 కోసం ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పిఓలు, ఏపీఓలు అందరూ ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురిచేయడానికి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని, అటువంటి వాటికి తావు ఇవ్వకుండా సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల సిబ్బందికి ఎవరైనా భోజనం లేదా కూల్ డ్రింక్స్ అందించినా వాటిని స్వీకరించడం వల్ల చిన్న విషయాలు కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని, పొరపాటున కూడా బయట ఎవరి ఆఫర్లను స్వీకరించకూడదని తెలిపారు. ఉద్యోగం చేయడం ఒకెత్తు అయితే, వివాదాల నుండి తప్పించుకోవడం చాలా ముఖ్యమని, ఏ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలాంటి మాటలు మాట్లాడకుండా వ్యక్తిగత అభిప్రాయాలు ఎక్కడా రిఫ్లెక్ట్ కాకుండా చూసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్ల వినియోగంపై కఠిన నిబంధనలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ మాత్రమే ఫోన్ కలిగి ఉండాలని, ఏపీఓలు లేదా ఇతర సిబ్బంది ఎవరూ ఫోన్లు దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదని ఆదేశించారు. పోలింగ్ సమయంలో దొంగ ఓట్లు రాకుండా ఉండేందుకు ఓటరు గుర్తింపు కార్డును పరిశీలించి, ఓటరు వేలికి సరైన మార్కింగ్ వేసి, ఆరిన తర్వాతే పోలింగ్‌కు అనుమతించాలని వివరించారు. పోలింగ్ రోజున ఆలస్యంగా రాకుండా ఒక గంట ముందే కేంద్రానికి చేరుకోవడం వల్ల ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా విధులు నిర్వర్తించవచ్చని తెలిపారు.

అలాగే మీ సొంత సలహాలు, ఆలోచనలు లేదా వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదన్నారు. పోలింగ్ బూత్ మీ చేతిలో ఉంటుందని, పోలింగ్ ప్రారంభమైన సమయం నుండి సీలింగ్ పూర్తయ్యే వరకు అక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యకలాపానికి మీదే పూర్తి బాధ్యత అన్నారు. పోలింగ్ బూత్ పరిధిలో ఉండే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, హెల్పర్ల సహాయంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే లేదా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.

పీఓ హ్యాండ్‌బుక్‌ను ఎండ్-టు-ఎండ్ క్షుణ్ణంగా చదివి, ఏ కార్యకలాపాన్ని ఎలా చేయాలో ముందే అవగాహన చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణ అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, కావున ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడి, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పార్వతీపురం మునిసిపల్ కమీషనర్ రామ్ గోపాల్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి