సాలూరు మున్సిపాలిటీలో కూటమి ధర్మానికి తూట్లు!

సాలూరు మున్సిపాలిటీలో కూటమి ధర్మానికి తూట్లు!

వైస్ చైర్మన్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు.. రెండో వైస్ చైర్మన్ ఎన్నికలో గేదెల లావణ్యకు నిరాశ

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు:

సాలూరు మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజకీయ పరిణామాలకు వేదికైంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గొర్లె విజయకుమారి, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో నిర్వహించారు.

జాయింట్ కలెక్టర్ సచిన్ అర్పిత్ రహర్ ముందుగా చైర్‌పర్సన్ గొర్లె విజయకుమారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మిగిలిన 32 మంది కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో పప్పుల మోహన్ రావుకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో పాటు మొత్తం 18 మంది కౌన్సిలర్లు మద్దతుగా చేతులెత్తారు. ఇందులో 11మంది టీడీపీ కౌన్సిలర్లు ముగ్గురు ఇండిపెండెంట్, ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు ఉండటంతో పప్పుల మోహన్ రావు వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇక రెండో వైస్ చైర్‌పర్సన్ పదవికి గేదెల లావణ్యకు 15 మంది జనసేన, వైసీపీ కౌన్సిలర్లు మద్దతుగా నిలిచారు. అయితే అవసరమైన కోరం లేకపోవడంతో ఆమె ఎన్నికలో విజయం సాధించలేకపోయారు.

కూటమి పార్టీల మధ్య ఉన్న రాజకీయ అవగాహనకు భిన్నంగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు సాలూరు మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కూటమి పార్టీల మధ్య సమన్వయం విషయంలో ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

THE 9 NEWS TELUGU
నిజం… మా లక్ష్యం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి