*||‘కన్యాశుల్కం’తో సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పారావు||* *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* గారు సెప్టెంబర్ 21న విజయనగరం పట్టణంలోని గురజాడ అప్పారావు గారి గృహాన్ని సందర్శించారు. తెలుగు సాహిత్య రంగంలో సామాజిక చైతన్యానికి, మానవతా విలువలకు, సమాజ సంస్కరణకు విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించి, గురజాడ అప్పారావు రచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొని, వారి కుటుంబ సభ్యులతో కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు మాట్లాడుతూ…. గురజాడ అప్పారావు గారు సాహిత్యాన్ని కేవలం వినోద సాధనంగా కాకుండా సామాజిక మార్పుకు, ప్రజల్లో చైతన్యానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించారని తెలిపారు. సమాజంలోని మూఢనమ్మకాలు, అసమానతలు, అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో సంస్కరణ భావాలను పెంపొందించడంలో ఆయన రచనలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. విజయనగరం జిల్లా పేరును ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు గురజాడ అప్పారావు గారు అని జిల్లా ఎస్పీ కొనియాడారు. “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అనే గురజాడ వారి సందేశం ప్రతి ఒక్కరిలో దేశభక్తి, మానవత్వం, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉందని ఎస్పీ గారు పేర్కొన్నారు. గురజాడ అప్పారావు గారి సాహిత్యం సమాజంలోని ప్రతి వర్గంలో చైతన్యాన్ని రగిలించిన సామాజిక ఉద్యమానికి ప్రతీకని, దేశాభివృద్ధి అనేది కేవలం భౌతిక ప్రగతితో సాధ్యం కాదు; మానవ విలువలు, సమానత్వం, బాధ్యతాయుతమైన పౌర సమాజంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపిన మహనీయుడు గురజాడ అప్పారావు అని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. యువత గురజాడ అప్పారావు గారి ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ, దేశ సేవలో భాగస్వాములు కావాలన్నారు. మహిళలకు గౌరవం, సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే గురజాడ ఆశయాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ వంటి రచనలు సమాజంలోని సామాజిక దురాచారాలను, అసమానతలను ప్రశ్నిస్తూ సంస్కరణ దిశగా ప్రజలను ఆలోచింపజేశాయని జిల్లా ఎస్పీ గారు గుర్తుచేశారు. ఆయన రచనల్లో ప్రతిబింబించిన మానవతా దృక్పథం, సమాజం పట్ల బాధ్యత, స్త్రీల పట్ల గౌరవం, విద్య ప్రాముఖ్యత వంటి విలువలు నేటి తరానికి కూడా ఎంతో అవసరమన్నారు. అనంతరం సత్య లాడ్జ్ వద్ద ఉన్న గురజాడ విగ్రహానికి మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురజాడ అప్పారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అడ్మిన్ పి.సౌమ్యలత, ఎ.ఆర్. అదనపు ఎస్పీ పి.కిరణ్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ గణపతి మండపాలకు భారీ విరాళం ఇచ్చిన కోట్ల రఘు