ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విషాదం.. ఉత్తరాంధ్ర టైగర్ కన్నుమూత!
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి సంస్థానాధీశుడు, సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
ఉత్తరాంధ్ర టైగర్, మన్యం పులిగా గుర్తింపు పొందిన విజయరామరాజు 1978లో జనతా పార్టీ తరఫున నాగూరు నుంచి ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్, టీడీపీలలో కొనసాగారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2017 నుంచి 2023 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు.
ఆయన మృతితో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
