భారీ ర్యాలీతో చీపురుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా విసినిగిరి ధనలక్ష్మి నామినేషన్
జనసేన సర్పంచ్ అభ్యర్థితో పాటు 20 మంది వార్డు సభ్యులను గెలిపించాలి
చీపురుపల్లి, నవంబర్ 21:
చీపురుపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ అభ్యర్థిగా విసినిగిరి ధనలక్ష్మి నిలిచారు. శనివారం భారీ ర్యాలీతో గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గులివిందాడ అగ్రహారంలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన, బీజేపీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, వార్డు సభ్యుల అభ్యర్థులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం మూడు రోడ్ల కూడలి వద్ద నిర్వహించిన సమావేశంలో జనసేన నాయకులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా చీపురుపల్లి టౌన్ జనసేన ఎంపీటీసీ సభ్యుడు కోట్ల కృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ నీతి, నిజాయితీ, ప్రజాసేవకు పెద్దపీట వేస్తుందని అన్నారు. సామాన్య ప్రజలు సైతం రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎదగాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని తెలిపారు.
ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తనకు ప్రజలు అందించిన ఆదరణ, ఆశీర్వాదాలను గుర్తుచేస్తూ.. అదే విధంగా సర్పంచ్ అభ్యర్థి విసినిగిరి ధనలక్ష్మికి కూడా ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థితో పాటు మొత్తం 20 మంది వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామాభివృద్ధికి రానున్న 50 రోజుల్లో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, పారిశుధ్యం, డ్రైనేజీ కాలువలు, రహదారుల అభివృద్ధితో పాటు అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్.వి.ఎన్., జనసేన జిల్లా నాయకులు దంతులూరి రమేష్ రాజు, ఎంపీటీసీ సభ్యుడు కోట్ల కృష్ణ, జనసేన, బీజేపీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, వార్డు సభ్యుల అభ్యర్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.









నిజం… మా లక్ష్యం.
THE 9 NEWS TELUGU