చైర్‌పర్సన్‌గా మజ్జి సిరి సహస్ర ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ చైర్‌పర్సన్‌గా పసల నీరజ
విజయనగరం, నవంబర్ 20:
విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి పార్టీల మద్దతుతో ఆమెకు ఈ కీలక బాధ్యత దక్కింది. అదేవిధంగా వైస్ జడ్పీ చైర్‌పర్సన్‌గా పసల నీరజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికైన మజ్జి సిరి సహస్రకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బాధ్యతలు దక్కడంతో ఆమె కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
తన కుమార్తెకు కీలక పదవి లభించడంపై టీడీపీ అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ టెంటు లక్ష్మణ నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. జడ్పీ సీఈఓ పి. కిరణ్ కుమార్ అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి కళా వెంకటరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే బేబీ నాయన, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్సీ శ్రీనివాసుల నాయుడు తదితర ప్రముఖులు హాజరై నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మజ్జి సిరి సహస్ర జిల్లా పరిషత్ చైర్పర్సన్ చాంబర్లో కుటుంబ సభ్యుల సమక్షంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తామని ఈ సందర్భంగా చిన్న శ్రీను ఆశాభావం వ్యక్తం చేశారు.




9NEWS తెలుగు నిజం… మా లక్ష్యం.