సాలూరు:
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలుస్తూ సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వ బీమా పథకం ద్వారా రూ.2 లక్షల పరిహారం అందేలా చొరవ తీసుకున్నారు.
సాలూరుకు చెందిన పైల గంగరాజు (39) రెండు నెలల క్రితం జొన్నాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో సభ్యుడిగా ఉండటంతో నిబంధనల ప్రకారం ఆయన భార్య పైల దేవికి రూ.2 లక్షల బీమా పరిహారం మంజూరైంది.
సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రం (సీఎఫ్ఎల్) కౌన్సిలర్లు శ్రావణ్ కుమార్, భవానీ శంకర్, మాధవరావు బాధిత కుటుంబానికి బీమా పథకంపై అవగాహన కల్పించారు. అవసరమైన పత్రాల సేకరణతో పాటు దరఖాస్తు ప్రక్రియలో సహకరించి పరిహారం మంజూరయ్యేలా కృషి చేశారు. దీంతో సాలూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ పి. ఝాన్సీ బాధితురాలు పైల దేవికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేశారు.
