*జాతరకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి*
*జాతరకు వచ్చే ప్రతి భక్తులు పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్లాలి*
*శాఖల సమన్వయంతో జాతర ఘనంగా నిర్వహించాలి*
*రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన శాఖామాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి*
*బస్సుల సంఖ్య రెట్టింపు చేయాలి*
*ప్లాస్టిక్ వినియోగం నియంత్రించాలి*
*జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి*
పార్వతీపురం, మక్కువ (శంబర), డిసెంబర్ 13 : సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర ఏర్పాట్లను పూర్తిచేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖామాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభం కానున్న శంబర జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలితో కలిసి దేవాదాయ శాఖ అదికారులు, దేవాలయ కమిటీ, ఇతర శాఖల అధికారులతో మంత్రి శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి సంబర పోలమాంబ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు జారీ చేసారు. గ్రామ పెద్దలు, అధికారులు సమన్వయంతో నెల రోజుల ముందుగా అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు. తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని, కొళాయిలు, బోర్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా మరుగుదొడ్లు సిద్దం చేయాలని, పారిశుధ్యం నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. అమ్మవారి మారు జాతర ముగిసే వరకు పారిశుధ్యంపై ప్రణాళిక వేసుకోవాలని తెలిపారు. పార్కింగ్ స్థలాలు, ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు పక్కాగా ఉండాలని, అత్యవసర సమయంలో అంబులెన్సులు వెళ్ళుటకు రహదారి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ శిబిరాలు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులలో అవసరమగు అన్ని మందులు శిబిరాల్లో అందుబాటులో ఉండాలని, ఫీడర్ అంబులెన్సు సిద్దంగా ఉంచుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, అవసరమగు విద్యుత్ సరఫరాకు అదనపు ట్రాన్స్ ఫార్మర్ లు ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజలకు సమాచారం ఇచ్చుటకు, సమాచారం స్వీకరించుట మైక్ ల ద్వారా ప్రకటించుటకు పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. కంట్రోల్ ఏర్పాటు చేసి అచ్చట నుండి సమాచారం అందించాలని సూచించారు. మైక్ ద్వారా ఇచ్చే సమాచారం జాతర జరిగే మొత్తం ప్రాంతంలో వినిపించాలని, రవాణాకు ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని రహదారులు భవనాలు శాఖను సూచించారు. వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం ఇబ్బందులు ఉండకుండా తగిన బస్సులు ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలన్నారు. దేవదాయ శాఖ అవసరమగు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. 2026 జనవరి 26 నుండి 28 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికలపై ప్రధానంగా చర్చించారు. పండగకు నెల రోజుల ముందే ఈ సమావేశం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో చర్చించిన అంశాలపై వివిధ శాఖల అధికారులు తమ యాక్షన్ ప్లాన్‌తో సిద్ధంగా వచ్చి, పండగకు ఒక వారం ముందు మరో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
అమ్మవారి దయ వల్ల పండగను ఎప్పటిలాగే పూర్తి స్థాయిలో, దిగ్విజయంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. మండలంలోని అధికారులు, అలాగే చుట్టుపక్కల 17 గ్రామాల ప్రజలు కలిసికట్టుగా సహకరించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం, ముఖ్యంగా దేవుడి మాన్యాల వద్ద రేకు షెడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, ఈ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్‌కు తావులేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పండగ పూర్తైన వెంటనే అమ్మవారి టెంపుల్‌ను అభివృద్ధి చేయాలనేది తన సంకల్పం అని తెలిపారు. అమ్మవారి దయ వల్ల ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయల టెంపుల్ నిధులు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో ఇక్కడ రోడ్లు వేసుకోవడం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించుకోవడం ద్వారా వచ్చిన అవకాశాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో అమ్మవారి వద్ద మరింత అభివృద్ధి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశం కేవలం ఆరంభం మాత్రమేనని, జాతర ఏర్పాట్లపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం పోలమాంబ అమ్మవారిని
కలెక్టర్, సబ్ కలెక్టర్ తో కలిసి మంత్రి
దర్శించుకున్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జాతర ప్రశాంతంగా సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జాతరకు వచ్చే ప్రతి భక్తుడు, భక్తురాలు పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్లాలని అందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అందుకు తగిన ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. గత అనుభవాల దృష్ట్యా లోపాలను సవరించుకుంటూ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలీస్ బందోబస్తు తగినంత ఏర్పాటు చేసి, ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అలాగే బస్సు స్టేషన్లలో పారిశుద్యంపై దృష్టి సారించి త్రాగునీరు,సౌకర్యలు కల్పించాలన్నారు. అలాగే ప్రతీ బస్సులో అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసి మైక్ కూడా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం నియంత్రించాలన్నారు.
సాలూరు నుండి మక్కువకు బస్సు సౌకర్యం లేకపోవడంపై మంత్రివర్యులు ఆర్టిసి అధికారులను ప్రశ్నించగా రోడ్డు సౌకర్యం లేక బస్సు నడపలేకపోతున్నా మన్నారు. రోడ్డు నిర్వహణకు సంబందించి ఆర్ అండ్ బి జెఈ రానున్న 2వారాల్లో రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టిసి అధికారులు వివరించారు. గత సంవత్సరం పండగ ముందుగా రోడ్లు వేయించడం ద్వారా భక్తులు అసౌకర్యం లేకుండా జరిగిందన్నారు. ఈ సంవత్సరం మరింత మంచిగా నిర్వహించాలన్నారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ఉన్నందున అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.
800 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుందని సిఐ రామకృష్ణ వివరించారు.
145 పారిశుధ్య కార్మికులు ఏర్పాటు చేసి నిరంతరం పారిశుధ్యం అదజేయడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు వివరించారు. జిల్లా కలెక్టర్ 250 మంది పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని వారికీ వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎపిఇపిడిసిఎల్ డిఇఇ విద్యుత్ ఏర్పాట్ల పై మాట్లాడుతూ 40 మంది సిబ్బందితో షిఫ్ట్‌ల వారిగా విధులు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ట్రాన్స్ఫర్ లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, 3పొల్లు మార్చవలసి ఉంది మార్చడం జరుగుతుందన్నారు. సిరిమాను తిరిగిన సమయంలో సప్లై ఆఫ్ చేయడం జరుగుతందని, జనరేటర్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు.
ఆర్డబ్ల్యూఎస్ ఇఇ మాట్లాడుతూ త్రాగు నీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ట్యాంకర్లతో త్రాగు నీరు అందజేయడం జరుగుతుందని అన్నారు. అలాగే గ్రామంలో వివిధ ప్రదేశాల్లో 50 మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మంత్రివర్యులు మాట్లాడుతూ అదనంగా మరుగుదొడ్లు ఏర్పాటుకు కావలసిన చర్యలు చేపట్టాలన్నారు.
ఎక్సైజ్ శాఖ అధికారి మాట్లాడుతూ పండగ మూడు రోజులు 24 గంటలు టెంపరరీ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే రెండు మొబైల్ టీమ్ లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మంగళవారం మధ్యాహ్నం మద్యం సినిమాను ప్రదర్శన అయినంతవరకు గ్రామంలో నిర్ణయం తీసుకోని విక్రయాలు ఆపవలసినదిగా మంత్రివర్యులు ఆదేశించారు.
మక్కువ తహసీల్దార్, ఎంపిడిఓ పండగ సమయంలో చేపట్టనున్న పనులు వివరించారు. పండగ రోజుల్లో దుకాణాల మంజూరుకు టెండర్లు పిలవాలన్నారు. గ్రామంలో చెత్త బుట్టలు ఏర్పాటు చేయాలన్నారు. సొంత నిర్ణయాలు తీసుకోకుండా సబ్ కలెక్టర్ వారి దృష్టిలోవుంచి అనుమతి తీసుకోవాలన్నారు.
శ్రీ పోలమంబ అమ్మవారి జాతర మహోత్సవంలో దేవాదాయ శాఖ చేపట్టానున్న పనులు వివరించారు.
వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ 8 మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అందుకు కావలసిన మందులు సిబ్బంది అందుబాటులో ఉంచడం తో పాటు 108, 104, ఫ్రీడమ్ అంబులెన్సులు అందుబాటులో ఉంచుకోవడం జరుగుతుందని వివరించారు. మంత్రివర్యులు మాట్లాడుతూ సుమారు 10 వారాలు పండగ జరుగుతుంది కావున మెడికల్ క్యాంపులు మరిన్ని రోజులు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎ.ఎస్.పి మనీషా రెడ్డి జిల్లా దేవాదాయ శాఖ అధికారి రాజారావు, జిల్లా పంంచాయతీ అధికారి కొండలరావు, జిల్లా విపత్తుల నివారణ అధికారి పి.సింహాచలం, జిల్లా రవాణాశాఖ అధికారి టి.దుర్గాప్రసాద్ రెడ్డి, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, వైద్య ఆరోగ్య, సంబంధిత శాఖ అధికారులు, మక్కువ ఎంపిడిఓ ఎన్. అర్జున్ రావు, తహసీల్దార్ కె. భరత్ కుమార్, ట్రెస్ట్ బోర్డు చైర్మన్ నైదాన తిరుపతి రావు, ఎంపిటిసి పిల్ల పోలినాయుడు, సర్పంచ్ ఎ.సింహాచలం, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, వసంతల భాస్కరరావు, గంజి కాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు.








