పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పెద్ద హరిజన పేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధా నాయుడు మరియు అంబేద్కర్ పోరాట సమితి ప్రతినిధి సోరు సాంబయ్య ఆధ్వర్యంలో, విజయనగరం మహారాజా మిమ్స్ (MIMS) హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు శ్రీ ఆర్.పి. భంజ్ దేవ్ గారు, అంబేద్కర్ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వైద్య శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీ ఆర్.పి. భంజ్ దేవ్ గారు మాట్లాడుతూ, స్ఫూర్తి మహిళా మండలి ద్వారా బలగ రాధా నాయుడు గారు మహిళా సాధికారతకు మరియు సామాజిక సేవకు చేస్తున్న కృషి ఎంతో హర్షణీయం అన్నారు. ముఖ్యంగా 1, 2, 3, 4 వార్డుల్లో నివసించే పేద ప్రజలు ఆర్థిక స్తోమత లేక, అవగాహన లోపంతో వైద్యానికి దూరంగా ఉంటున్నారు. అటువంటి వారి చెంతకే నిపుణులైన డాక్టర్లను తీసుకొచ్చి ఉచిత వైద్యం అందించడం అభినందనీయం. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఈ శిబిరం ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాధా నాయుడు గారికి, సోరు సాంబయ్య గారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బలగ రాధా నాయుడు, సోరు సాంబయ్య లు మాట్లాడుతూ పేద వర్గాలకు వైద్య సేవలు అందించటమే లక్ష్యంగా జిల్లాలో పలుచోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేదలకు వచ్చే ప్రాణాంతకం అయ్యే పలు రోగాలు ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే, వాటికి శాశ్వత నివారణ సాధ్యమవుతుందని, అవసరమైన వారికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సూచించడం జరుగుతుందన్నారు. మిమ్స్ మెడికల్ కాలేజీకి చెందిన 11 మంది నిపుణులైన వైద్యుల బృందం పాల్గొని, రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన సలహాలతో పాటు, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు గొంప ప్రకాష్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ డాక్టర్ చిరంజీవిరావు, మహిళా మండలి సభ్యులు, అంబేద్కర్ పోరాట సమితి కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ జై అమరావతి సాంప్రదాయబద్ధం గా ఇటుక పండుగ