విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుధరాయవలసి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కోనేటిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఇటీవల తుఫాను ప్రభావంతో చెరువులు, కోనేరులు భారీగా నిండిపోయాయి. సాయంత్రం సమయంలో కోనేటి వద్దకు వెళ్లిన చిన్నారులు నీటిలోకి దిగారు. ఈత రాకపోవడంతో ఒక బాలుడు ప్రమాదంలో చిక్కుకోగా, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా నీటిలో మునిగిపోయారు.

ఈ ఘటనలో మండల వేమచంద్ర (10), సార్ కి చంద్రశేఖర్ (9), శంకరాపు వెంకటేష్ (9) మృతి చెందారు. ముగ్గురూ చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

నిన్నటివరకు కలిసి ఆడుకున్న చిన్నారులు నేడు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారుల మృతదేహాలను చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

పిల్లల కేరింతలతో సందడిగా ఉండే బుధరాయవలసి గ్రామం ఇప్పుడు విషాద ఛాయలతో నిండిపోయింది. ప్రతి ఇంటా శోకం అలుముకోగా, చిన్నారుల కుటుంబాల రోదనలు గ్రామాన్ని కలచివేస్తున్నాయి.

ఒకరిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ హృదయ విదారక ఘటనతో బుధరాయవలసి గ్రామం శోకసంద్రంగా మారింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి