వినాయకుడి సన్నిధిలో విశ్వాసాల సంగమం..

మొక్కు నెరవేరడంతో ముస్లిం కుటుంబం వసంత పూజ.. సాలూరులో సోదరభావానికి అపురూప దృశ్యం

భక్తికి హద్దులు లేవని చాటిన ఘటన.. వినాయకుడి చెంత కుటుంబ సభ్యులతో కలిసి పూజలు

సాలూరు :

భక్తికి మతం అడ్డుకాదని చాటిచెప్పే ఆత్మీయ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని వడ్డీ వీధిలో చోటుచేసుకుంది. వడ్డీ వీధి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ బాల గణపతి విగ్రహానికి ముస్లిం కుటుంబం వసంత పూజ నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది.

మహమ్మద్ అబ్దుల్ హక్, మహమ్మద్ సల్మా కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కుమారుడికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం రావాలని కోరుకుంటూ, కోరిక నెరవేరితే వినాయకుడికి పూజ నిర్వహించి మొక్కు తీర్చుకుంటానని గతంలో మొక్కుకున్నట్లు అబ్దుల్ హక్ తెలిపారు.

ఇటీవల తన కుమారుడికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం లభించడంతో మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి వడ్డీ వీధిలోని శ్రీ బాల గణపతి సన్నిధికి చేరుకుని వసంత పూజ నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమం మజ్జి చిరంజీవిరావు, మజ్జి నటరాజ్ ఆధ్వర్యంలో, వడ్డీ వీధి యూత్ సభ్యుల సహకారంతో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, యూత్ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

వినాయకుడిని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, శుభకార్యాలకు శ్రీకారం చుట్టించే గణనాథుడిగా భక్తులు ఆరాధిస్తారు. కోరిక నెరవేరిన అనంతరం అబ్దుల్ హక్ కుటుంబం గణనాథుడి సన్నిధిలో మొక్కు తీర్చుకోవడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.

ఈ సందర్భంగా అబ్దుల్ హక్ మాట్లాడుతూ.. తన కుమారుడికి దేశ రక్షణలో సేవ చేసే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను కోరుకున్న విధంగా కుమారుడికి ఆర్మీలో ఉద్యోగం రావడంతో గణనాథుడి సన్నిధిలో మొక్కు తీర్చుకున్నానని తెలిపారు. భక్తి, విశ్వాసాలు మనుషుల మధ్య ప్రేమ, గౌరవం, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

మత విశ్వాసాలు వేర్వేరైనా పరస్పర గౌరవం, ఆత్మీయత, మానవీయ విలువలు అందరినీ కలుపుతాయనే సందేశాన్ని ఈ ఘటన అందించింది. వినాయకుడి సన్నిధిలో ముస్లిం కుటుంబం వసంత పూజ నిర్వహించిన దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది.

విశ్వాసాల దారులు వేరైనా.. భక్తి భావం మనసులను కలిపిన ఈ ఘటన సాలూరులో సోదరభావానికి ఆత్మీయ ప్రతీకగా నిలిచింది..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి