సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
విజయనగరం | నవంబర్ 26, 2026: సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర బాధ్యతలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, జాతీయ సమైక్యతను కాపాడుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి. సాయి దేవమణి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, విధులపై ప్రతి విద్యార్థి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు శ్రీ ఎస్. మహేష్ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతంలో రాజ్యాంగ ప్రాధాన్యతను వివరించారు.
విద్యార్థులు సంజన, మానస సాయి, వెంకటేష్ రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్రపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
అనంతరం విద్యార్థులందరూ భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి, రాజ్యాంగ ఆశయాలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి కెప్టెన్ ఎం. సత్యవేణి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి శ్రీ బి. సూరపు నాయుడు, అధ్యాపకులు, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.





