జ్వరాల సర్వే నిరంతరం జరగాలి
పార్వతీపురం, జూలై 24 : ఒక గ్రామంలో జ్వరం కేసు నమోదు అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును క్షుణ్ణంగా విచారణ చేయాలని ఆయన ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కడా నమోదు కాకుండా శత శాతం చర్యలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద కేసులు ఉన్నా అన్ని పరీక్షలు చేసి మంచి వైద్యాన్ని అందించాలని ఆయన ఆదేశించారు. వైద్య అధికారులు తమ క్షేత్ర స్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ పక్కాగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సీతంపేట, కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో మరింత శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు. జ్వరాల సర్వే నిరంతరం సాగాలని, మందులు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. పారిశుధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఒక్క మరణం కూడా సంభవించరాదని ఆయన అన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రస్తుత సీజన్ లో వైద్య అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సిబ్బంది సేవలను ప్రణాళికాబద్ధంగా పక్కాగా వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. అవసరం మేరకు మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు సిబ్బందిని డిప్యూట్ చేయాలని ఆదేశించారు. కీటకాల (వెక్టార్) ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టాలని ఆయన ఆదేశించారు.
రక్త హీనత నివారణ, మాతృ శిశు మరణాలు జరగకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పిల్లల నుండి పెద్దల వరకు రక్త హీనత సమస్య కనిపిస్తుందని ఆయన చెప్పారు. సామాజిక కిచెన్ గార్డెన్ ను నిర్వహించాలని, పౌష్టిక ఆహారం గురించి అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. గర్భిణీల నమోదులో జాప్యం జరగరాదని ఆయన అన్నారు. ప్రతి గర్భిణీని పరీక్షించాలని ఆయన అన్నారు. ఐరన్ ధాతువులు లోపం లేకుండా చూడాలని ఆయన చెప్పారు. వ్యక్తిగత శ్రద్ద వహించాలని ఆయన ఆదేశించారు. మాదలంగి, దుడ్డుకల్లు, మర్రిపాడు, తగితర పిహెచ్ సీ ల పరిధిలో రక్త హీనత నివారణకు మరింత కృషి చేయాలని ఆయన అన్నారు. పిహెచ్ సీ లకు గ్రేడింగ్ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఆధార్ శిబిరాలు జరుగుతున్నాయని, వాటిలో ప్రజల వివరాలు సరిదిద్దుకోవచ్చని ఆయన అన్నారు. తద్వారా ఆర్ సి హెచ్ పోర్టల్ లో నమోదులో ఇబ్బందులు లేకుండా చేయవచ్చని తెలిపారు.
ప్రతి నెల మండలాల్లో రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, వైద్య అధికారులు సమన్వయం చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ పార్వతి, జిల్లా మలేరియా అధికారి వై మణి, జిల్లా ఇమ్మ్యూనైజేశన్ అధికారి నారాయణ రావు, డిప్యూటీ డిఎంహెచ్ ఓ శివ కుమార్, ప్రోగ్రాం అధికారులు ఎం వినోద్, టి జగన్మోహన రావు, వైద్య అధికారులు, పి హెచ్ సి వైద్యులు పాల్గొన్నారు.