రైతులు మరియు ఉత్పత్తిదారుల సమాఖ్య – ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో 04-04-2026 న గుంటూరు జిల్లా, ఉండవల్లి లోని రాజా గ్రుహ బిల్డింగ్‌లో నిర్వహించిన రైతులు, FPOలు మరియు MACS ప్రతినిధుల సమావేశం విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి రైతులు, సంఘ నాయకులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీ అనమోలు గాంధీ గారు, భారతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షులు పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ, మధ్యవర్తుల చేత రైతులు దోపిడీకి గురికాకుండా కఠినమైన నియంత్రణలు అవసరమని, రైతులు మరియు ఉత్పత్తిదారులను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి టి. జానకి దేవి గారు మాట్లాడుతూ, రైతులు FPOలు లేదా MACSల రూపంలో ఏకమైతే మధ్యవర్తుల ఆధిపత్యాన్ని తగ్గించి, తమ ఉత్పత్తులకు తామే సరైన ధర నిర్ణయించే స్థాయికి చేరుకుంటారని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తూ కొత్త FPOలు ఏర్పాటు చేయడంలో సమాఖ్య పూర్తిస్థాయిలో సహాయం చేస్తుందని వెల్లడించారు.

అతిథి శ్రీమతి ఎం. అస్విని గారు (GM, APCOB) మాట్లాడుతూ, మంచి టర్నోవర్ ఉన్న FPOలకు రుణాలు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అర్హత కలిగిన సంస్థలకు బ్యాంకుల ద్వారా పూర్తి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

హైకోర్టు న్యాయవాది శ్రీ అంగూరు మనోహర్ నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ తాజా CCFS , 2026 పథకం గురించి వివరించి, రాష్ట్రవ్యాప్తంగా రైతులు మరియు FPOలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.

సమావేశంలో మార్కెటింగ్‌లో సరైన ధరల లభ్యత లోపం, మార్కెట్ కనెక్టివిటీ సమస్యలు, ఫైనాన్స్ లోపాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. అలాగే రైతు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గ్రామాల్లో కొత్త FPOలు ప్రారంభించే విషయంపై ఆసక్తి వ్యక్తం చేశారు.
రైతులు మరియు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా రైతులకు నేరుగా మార్కెట్ అవకాశాలు కల్పించడం, డిజిటల్ మార్కెటింగ్ ప్రోత్సాహం, ఆర్థిక సహాయం, సంస్థల బలోపేతం వంటి అంశాల్లో సంపూర్ణ సహకారం అందించేందుకు సమాఖ్య కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సమావేశం రైతులు మరియు FPOలకు మార్గదర్శకంగా నిలిచి, భవిష్యత్‌లో వారి బలోపేతానికి దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి