గరివిడి పశు వైద్య కళాశాలలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ విశ్వవిద్యాలయ అంతర్కళాశాల క్రీడా, సాంస్కృతిక–సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవాలు ఈ నెల 5వ తేదీన అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా ప్రొఫెసర్ డాక్టర్ మక్కెన శ్రీను గారు అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథిగా శ్రీ సి.హెచ్.వి.ఎస్. పద్మనాభ రాజు గారు, కమాండెంట్, ఏపీ స్పెషల్ పోలీస్, ఫస్ట్ బెటాలియన్, ఎచ్చెర్ల పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా డాక్టర్ వి. వైకుంఠ రావు గారు (డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి), డాక్టర్ బి. జయచంద్ర గారు (ప్రొఫెసర్ & యూనివర్సిటీ హెడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్), బాబురావు గారు (మయూర గ్రూప్స్ ఆఫ్ హోటల్స్, విజయనగరం), డాక్టర్ వై.ఆర్. అంబేద్కర్ గారు (ఆఫీసర్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్) పాల్గొన్నారు. అతిథులు శాంతికపోతాలను ఎగురవేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.
ప్రారంభోత్సవంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ, క్రీడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్ని అనుబంధ కళాశాలల విద్యార్థులతో సైనిక బ్యాండ్తో గ్రాండ్ మార్చ్ ఫాస్ట్ నిర్వహించి అథ్లెటిక్ ప్రమాణ స్వీకారం చేయించారు. వివిధ కళాశాలల విద్యార్థులు రంగురంగుల వస్త్రధారణలో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే జానపద నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వి. వైకుంఠ రావు గారు మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడలు సమయ నిర్వహణ, ఏకాగ్రతను పెంచి ఆరోగ్యకర జీవనశైలికి, సామాజిక ఐక్యతకు దోహదపడతాయని ఇతర అతిథులు పేర్కొన్నారు.
ఈ సమ్మేళనం జనవరి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కొనసాగనుండగా, మొత్తం 50 క్రీడా మరియు సాంస్కృతిక–సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ కళాశాలల నుంచి సుమారు 530 మంది విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవం అనంతరం అతిథులు వాలీబాల్ ఆటను ప్రారంభించి విద్యార్థులతో కలిసి సరదాగా ఆటలో పాల్గొని కార్యక్రమాన్ని ఆస్వాదించారు.





