జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షుడు: నిమ్మక
సాలూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
పార్వతిపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీ జెండా ఎగుర వేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నిమ్మక సింహాచలం అన్నారు. బుధవారం రాత్రి సాలూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి రాష్ట్రాలను నిలబడుతుంటే రాష్ట్రంలో వైకాపా భవనాలను పడగొడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ ఆధ్వర్యంలో అత్యధిక సీట్లు గెలుపొంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. బిజెపి పాలనలో దేశం విచ్ఛిన్నమైందన్నారు. దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యువతను ప్రోత్సహించేలా సాలూరు ఎమ్మెల్యే సీటును మువ్వల పుష్పారావుకు అధిష్టానం కేటాయించిందన్నారు. పుష్పారావును గెలిపించేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తారని అన్నారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుష్పారావు, జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, కన్వీనర్ నారాయణరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.