జిల్లా అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేద్దాం
జెడ్‌పి సమావేశంలో మంత్రులు కొండపల్లి, గుమ్మిడి
టోల్‌గేట్‌ను తరలించాలి ః ఛైర్‌పర్సన్ శ్రీనివాసరావు
సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై చర్చ
స్థాయి సంఘాల్లో సభ్యులుగా నియమితులైన ఎంఎల్ఏలు
విజయనగరం, జులై 12 ః
పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్దికి సమన్వయంతో, కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారిరువురు స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జెడ్‌పి సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయం, నీటి పారుదల, వైద్యారోగ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మంత్రులు కొండపల్లి, గుమ్మిడి సంధ్యారాణితోపాటు, పలువురు ఎంఎల్ఏలు, ఎంపిలు తొలిసారిగా హాజరైన ఈ సమావేశంలో ముందుగా జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ సభ ద్వారా జిల్లా ప్రజలందరికీ మంచి చేయాలన్నదే సభ్యులందరి లక్ష్యమని అన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. గతంలోవలే వివిధ నియోజకవర్గాల ఎంఎల్ఏలను ఆయా స్థాయి సంఘాల సభ్యులుగా నియమిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని, విమానాశ్రయాన్ని త్వరగా పూర్తి చేయాలని, గిరిజన యూనివర్సిటీ పనులను మొదలు పెట్టాలని కోరారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు.
*వ్యవసాయశాఖ*
వ్యవసాయశాఖపై జరిగిన చర్చలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, రైతు అభీష్టం మేరకు, వారికి కావాల్సిన విత్తనాలు సరఫరా చేయాలని కోరారు. వరివిత్తనాలు 1121 వల్ల గతంలో రైతులు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. పంట నష్టపరిహారం రైతులకు సక్రమంగా అందలేదని, దీనికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని వ్యవసాయశాఖ జెడిలను ఆదేశించారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు రాకుండా చూడాలన్నారు. గిరి శిఖర గ్రామాలకు సైతం విత్తనాలు అందేలా చూడాలన్నారు. చిరుధాన్య విత్తనాలను గిరిజనులకు 90శాతం సబ్సిడీపై అందించాలన్నారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో ఏయే విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్న పూర్తి సమాచారాన్ని రైతులకు అందించాలని ఆదేశించారు. గత ఏడాది కంటే అధికంగా, సకాలంలో విత్తనాలను సరఫరా చేసినందుకు వ్యవసాయ శాఖను అభినందించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, ఎరువులు, విత్తన షాపులపై దాడులు చేయిస్తున్నామని చెప్పారు. అవకతవకలు గుర్తించిన షాపులను సీజ్ చేయిస్తున్నామన్నారు. కురుపాం ఎంఎల్ఏ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో కూడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. నెల్లిమర్ల ఎంఎల్ఏ లోకం నాగమాధవి మాట్లాడుతూ, గతంలో విత్తనాల్లో మొలకశాతం తక్కువగా ఉందని, నకిలీ విత్తనాలను అరికట్టాలని సూచించారు. ఆయిల్ ఇంజన్లు, స్పింక్లర్లు తదితర వ్యవసాయ పరికరాలను 90శాతం సబ్సిడీపై అందించాలని సభ తీర్మాణం చేసింది.
*నీటి పారుదల*
మంత్రి కొండపల్లి మాట్లాడుతూ, కొత్త ప్రాజెక్టులు, కాలువల కంటే, ప్రస్తుతం ఉన్న కాలువలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా పంట కాలువల్లో పిచ్చిమొక్కలు, పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తారకరామ తీర్ధసాగర్‌ను పూర్తి చేయడం ద్వారా భోగాపురం విమానాశ్రయానికి నీటిని అందించడంతోపాటు, విజయనగరం పట్టణానికి త్రాగునీరు, నెల్లిమర్ల నియోజకవర్గానికి సాగునీరు అందుతుందన్నారు. ఆ దిశగా కృషి చేద్దామన్నారు. నీటిపారుదల రంగంపై జరిగిన చర్చలో, జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితిని నార్త్‌కోస్టల్ సిఈ సుగుణాకరరావు వివరించారు. మొత్తం 11 ప్రాజెక్టుల్లో 129 పనులకు రూ.8.29 కోట్లతో ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 237 మంది లష్కర్ల నియామకానికి కూడా ప్రతిపాదించినట్లు తెలిపారు. మంత్రి కొండపల్లి చలవతో ఎంఎన్‌ఛానల్ ద్వారా సుమారు 700 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, తోటపల్లి కాలువల ద్వారా శివారు భూములకు కూడా సాగునీరు అందించాలని కోరారు. విజయనగరం ఎంఎల్ఏ అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, ప్రతిపాదించిన కొత్త పనుల వివరాలను అందించాలని కోరారు. నిర్వహణా లోపంవల్లే తోటపల్లి నుంచి శివారు భూములకు నీరు అందించలేకపోతున్నామన్నారు.
ఎంఎల్ఏ నాగమాధవి మాట్లాడుతూ, ఇసుక అక్రమంగా తరలించి చంపావతి నిదని చంపేశారని అన్నారు. తమ నియోజకవర్గంలో వర్షపాతం తక్కువని, ప్రాజెక్టులద్వారా సాగునీరు కూడా సరిగ్గా అందే పరిస్థితి లేదన్నారు. లేఅవుట్ల కారణంగా చెరువులకు వెళ్లే కాలువలు మూసుకుపోయాయని చెప్పారు. కలెక్టర్ అంబేద్కర్ స్పందిస్తూ, లేఅవుట్లపై రెవెన్యూ సిబ్బందితో సర్వే చేయించి, అక్రమణలను తొలగించేందుకు కృషి చేస్తామన్నారు. ఛైర్‌పర్సన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా జిల్లాలో కరువు మండలాలు లేవని అన్నారు. నిబంధనల ప్రకారమే ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే చాలావరకు జిల్లాలో సాగు, త్రాగునీటి సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. పార్వతీపురం ఎంఎల్ఏ బోనెల విజయచంద్ర మాట్లాడుతూ, వరహలగెడ్డ ఆక్రమణలపై అధికారులను నిలదీశారు. జంఝావతి హైలెవెల్ కెనాల్ ఎందుకు ఆగిందని ప్రశ్నించారు. దీనిపై ఛైర్మన్ మాట్లాడుతూ, ఇది అంతర్రాష్ట్ర సమస్య అనీ, రాష్ట్రస్థాయిలో ఇది పరిష్కారం కావాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తోటపల్లి, గడిగెడ్డ, చంపావతి నదుల అనుసంధానం జరగలేదని ఎంఎల్ఏ అదితి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ సభ్యులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
*వైద్యారోగ్యశాఖ*
వైద్యారోగ్యశాఖపై వాడిగా వేడిగా చర్చ జరిగింది. సీజనల్ వ్యాధులను అరికట్టడానికి అన్నిరకాల చర్యలూ తీసుకోవాలని మంత్రులిద్దరూ రెండు జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మలేరియా, బోదకాలు వ్యాదుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పారిశుధ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. జిల్లా సర్వజన ఆసుపత్రి సమస్యలను ఎంఎల్ఏ అదితి వివరించారు. ఇక్కడ సిబ్బందిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనిపై మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ, ఎట్టి పరిస్థితిలోనూ వైద్యులను, సిబ్బందిని తగ్గించరాదని ఆదేశించారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ, ఘోషాలో కూడా సిబ్బందిని తగ్గించే పరిస్థితి ఉందని, దానిని ఆపాలని కోరారు. దీనిపై కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ, జిల్లా సర్వజన ఆసుపత్రి వైద్యకళాశాలగా మార్పు చెందడంతో, ఎన్‌హెచ్ఆర్ఎం పథకంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని వేరే ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అయినప్పటికీ ఇక్కడ డాక్టర్లు, సిబ్బందీ తగ్గకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో విధులకు వెళ్లాలని, సక్రమంగా సేవలను అందించేలా చూడాలని డిఎంఅండ్‌హెచ్ఓను ఆదేశించారు.
అరకు ఎంపి డాక్టర్ తనూజరాణి మాట్లాడుతూ, వర్షాకాలంలో గిరిశిఖర గ్రామాల్లో జ్వరాలు విజృంభించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతల మరణాలను ఆపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన కల్పించి, మేనరిక వివాహాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎల్‌సి డాక్టర్ సురేష్‌బాబు మాట్లాడుతూ, పూసపాటిరేగ మండలం కనిమెట్ట గ్రామంలో విజృంభించిన వ్యాధులను ప్రస్తావించారు. వైద్యులు సకాలంలో సక్రమంగా సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులకు ప్రహరీగోడలు లేవని, మోపాడ ఆసుపత్రిలో ఆక్రమణలను తొలగించాలని ఎంఎల్ఏ లోకం నాగమాధవి కోరారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. ఈ సందర్భంగా సామాజిక పింఛన్ల పంపిణీపై చర్చ జరిగింది. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, కొంతమంది ముత్తైదువలకు కూడా వితంతు పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. నిజమైన పేదలకు మాత్రమే పింఛన్లు అందాల్సి ఉందన్నారు. గిరిశిఖర గ్రామాలకు వైద్యసేవలను అందించేందుకు ఫీడర్ అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పింఛన్ల పరిశీలనకు త్వరలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
జెడ్‌పి ఛైర్మన్ మాట్లాడుతూ, వైద్యారోగ్య పింఛన్ల విషయంలో దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందించేలా చూడాలని, అనర్హులను తొలగించాలని సూచించారు. కొంతమంది జెడ్‌పిటిసిల ఫిర్యాదుపై స్పందిస్తూ, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాన్ని ఎట్టిపరిస్థితిలోనూ సహించేది లేదని మంత్రులు సంధ్యారాణి, శ్రీనివాస్ స్పష్టం చేశారు. విఏఓల తొలగింపుపై విచారణ చేయాలని ఆదేశించారు. జొన్నాడవద్ద ఏర్పాటు చేసిన టోల్‌గేట్‌ను అక్కడినుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తీర్మాణం చేయడంతో సభ ముగిసింది. పలువురు జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు తమ ప్రాంతంలోని సమస్యలను వివరించారు.
ఈ సమావేశంలో విజయనగరం, పార్వతీపురం జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, జెడ్‌పి సిఇఓ శ్రీధర్‌రాజా, డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
…………………………………………………………………………………………………….
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.