చీపురుపల్లి,
గరివిడి మండలం కోడూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆడపా సూర్యనారాయణ గారు మరణించిన వార్త పట్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గత నాలుగు రోజులుగా ఆయన అదృశ్యం కావడం తనను కలచివేసిందని, క్షేమంగా తిరిగి వస్తారని ఆశించినా, ఇలా విగతజీవిగా కనిపించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కళావెంకటరావు గారు చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ సూర్యనారాయణ గారి మృతదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
సూర్యనారాయణ గారు కోడూరు గ్రామానికి, పార్టీకి చేసిన సేవలు వెలకట్టలేనివి. ఆయన మరణం తీరని లోటు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం మరియు పార్టీ పరంగా ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు.
సమగ్ర విచారణకు ఆదేశం – కుట్ర కోణంపై నిగ్గు తేల్చాలి..
ఈ ఘటనపై ఎమ్మెల్యే కళావెంకటరావు గారు అధికారికంగా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సూర్యనారాయణ గారి అదృశ్యం, అనంతరం ఆయన మృతదేహంగా లభ్యం కావడం వెనుక ఏవైనా కుట్ర కోణాలు ఉన్నాయా అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. దీనిపై నిష్పక్షపాతంగా, అత్యంత వేగంగా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను విడిచిపెట్టే ప్రసక్తి లేదని, వాస్తవాలు నిగ్గుతేలే వరకు తాను పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు.
ఆసుపత్రి వద్దే ఉండి, పోస్టుమార్టం ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా వైద్యులను మరియు అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే గారు, అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. సూర్యనారాయణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తన గాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఓం శాంతి!
















