ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తే అసలైన రక్షణ 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి సాలూరులో రేపు ఉచిత మెగా వైద్య శిబిరం.. వాయిస్ ట్రస్ట్ అధ్యక్షులు నాగార్జున సాలూరు, సెప్టెంబర్ 28: అనారోగ్యంతో బాధపడుతున్న వారికే వైద్య పరీక్షలు అవసరమనే భావన నుంచి ప్రజలు బయటకు రావాలని, 30 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని వాయిస్ ట్రస్ట్ అధ్యక్షులు నాగార్జున అన్నారు. ముందస్తుగా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాయిస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నవోదయ వెల్ఫేర్ సొసైటీ, సుఖీభవ హాస్పిటల్స్ సహకారంతో సెప్టెంబర్ 29న సాలూరులోని వేలంపేట కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నాగార్జున తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం కొనసాగుతుందని చెప్పారు. శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు రక్తపోటు, రక్తంలో చక్కెర, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తామని తెలిపారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా తమ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకోవడం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్న నేపథ్యంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలని నాగార్జున సూచించారు. ఆరోగ్యం బాగానే ఉందని భావించి పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవచ్చన్నారు. సాలూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేలంపేట కళ్యాణ మండపంలో జరిగే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాయిస్ ట్రస్ట్ అధ్యక్షులు నాగార్జున కోరారు.. Spread the love టపా నావిగేషన్ సాలూరులో ‘అభివృద్ధి’కి మూడు అడుగులు.. విద్యకు భవనం, పేదలకు అన్నం, పార్టీకి కొత్త వేదిక నృత్యంతో మెరిసిన పూజిత.. జాతీయ వేదికపై రెండో స్థానం