సాలూరు: అర్ణబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సాలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రహదారులు, కల్వర్టులు, చెరువులు, పంట పొలాలు, నివాస ప్రాంతాల్లో ఏర్పడిన ఇబ్బందులపై మంత్రి సంధ్యారాణి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాలూరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిలిచిన వరద నీటిని మంత్రి పరిశీలించారు. ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలగకుండా నీటిని తొలగించడంతో పాటు పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం సాలూరు మండలంలోని వర్ష ప్రభావిత ప్రాంతాలపై మంత్రి ఆరా తీశారు. పెదపదం పంచాయతీ పరిధిలోని నీలం చెరువు, నెలిపర్తి నుంచి విశ్వనాధపురం వెళ్లే దెబ్బతిన్న పంచాయతీ రహదారి పరిస్థితిని పరిశీలించారు. రహదారి మరమ్మతులను వేగంగా చేపట్టి ప్రజలకు రాకపోకల ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయతీ పరిధిలోని చిట్టిగెడ్డ కల్వర్టు పరిస్థితిని కూడా మంత్రి పరిశీలించారు. వరద ప్రవాహం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పాచిపెంట మండలంలోని వేటగానివలస రహదారి దెబ్బతిన్న పరిస్థితిపైనా మంత్రి అధికారులతో సమీక్షించారు. రహదారి పనులను వెంటనే చేపట్టి రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, చెరువులు, పంట పొలాలు, నివాస ప్రాంతాలపై అధికారులు సమగ్రంగా నష్టం అంచనా వేయాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు భవిష్యత్తులో భారీ వర్షాలు, వరదల సమయంలో ఇదే సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రజల రాకపోకలు, భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. తాత్కాలిక మరమ్మతులతో సమస్యను వాయిదా వేయకుండా, అవసరమైన చోట శాశ్వత రక్షణ చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. Spread the love టపా నావిగేషన్ వర్షం తగ్గినా.. వ్యాధుల ముప్పు తగ్గదు! చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. డీ-వార్మింగ్పై మంత్రి సంధ్యారాణి అవగాహన