ప్రభుత్వ కళాశాలల ఇంటర్ ఫలితాలు చూసి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిన్న విడుదలయిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థుల ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న వారిలో ప్రథమ సంవత్సరంలో 62%, ద్వితీయ సంవత్సరంలో 42% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇంటర్ పరీక్షలలో రాష్ట్ర వ్యాప్తంగా 10,02,150 మంది హాజరవగా 6,63,584 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,29,528 మంది అంటే 78%, మొదటి సంవత్సరం విద్యార్థులు 3,34,056 మంది అంటే 67% ఉన్నారు. మన విజయనగరం జిల్లాని తీసుకుంటే ప్రథమ సంవత్సరం 62%, ద్వితీయ సంవత్సరం 70% తో రాష్ట్రంలో 19 వ స్థానంలో ఉంది. ఇదీ మన మంత్రి గారి జిల్లా పరిస్థితి. మనం గమనించినట్లయితే ప్రభుత్వ కళాశాలల్లో ఓ పక్క ప్రవేశాలు తగ్గిపోతుండగా, చేరిన వారిలోనూ పాస్ అవుతున్న వారి సంఖ్య దారుణంగా పడిపోతుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాల పిల్లలే. వారికి నాణ్యమైన విద్యను అందించి పై చదువులకు పంపించాల్సిన బాధ్యత సర్కారుది కాదా?
               ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పాఠాలు చెప్పే అధ్యాపకులు కరువయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 84 కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేకుండానే ఒప్పంద, అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. అన్ని కళాశాలల్లో కలిపి 6,116 పోస్టులు ఉండగా వీటిల్లో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులు 2,010 మంది మాత్రమే. రెగ్యులర్ అధ్యాపకులను ఆయా కళాశాలల్లో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా పట్టించుకోకపోవడం దారుణం. పిల్లల చదువుకోసం ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంది, మీ చదువులకు నాది పూచి అని చెప్పిన మన ముఖ్య మంత్రి గారు ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి స్వస్తి పలికారు. పాఠ్యపుస్తకాలు లేకుండా పేద పిల్లలు ఎలా చదువుకుంటారని కనీసం ఆలోచించలేదు. డబ్బున్న వారు తమ పిల్లలని కార్పోరేట్ కళాశాలల్లో చదివించుకుంటారు. మరి పేద పిల్లల పరిస్థితి ఏంటని ప్రభుత్వం ఆలోచించకపోవడం బాధాకరం. కనీసం రాబోయే ప్రభుత్వం అయినా ప్రభుత్వ కళాశాలల మీద దృష్టి పెట్టి పేద విద్యార్థులకు మంచి ప్రమాణాలతో కూడిన కళాశాల విద్యను అందించే ఏర్పాటు చెయ్యాలని లోక్ సత్తా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *