ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత

సాలూరు మున్సిపాలిటీ సమీక్షలో మంత్రి సంధ్యారాణి.. అధికారులకు దిశానిర్దేశం

సాలూరు: పట్టణంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. సాలూరు మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సౌకర్యాలపై సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె అధికారులతో విస్తృతంగా చర్చించారు.

పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సమకూరుతున్న నిధులను ప్రాధాన్యతా క్రమంలో వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం, ప్రజా సౌకర్యాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

సాలూరు పట్టణంలో చేపట్టిన సెంటర్‌ లైటింగ్‌ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల విషయంలో నాణ్యతతో పాటు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన ఇళ్ల పన్నుల అంశాన్ని కూడా మంత్రి సమీక్షించారు. 2009 సంవత్సరానికి ముందు నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించిన పన్నుల మంజూరు ప్రక్రియను పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైతు బజార్‌ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేలా, వినియోగదారులకు ప్రయోజనం కలిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి ఇప్పటికే పలు వార్డుల్లో చేపట్టిన పైలట్‌ వాటర్‌ స్కీమ్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి తెలిపారు. అవసరమున్న ప్రాంతాలను గుర్తించి అదనపు నీటి పథకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు స్పందించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజా సేవల విషయంలో నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లకు తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు.

సమీక్షలో మున్సిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ వైశాలి IASతో పాటు మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు

.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి