విధి నిర్వహణలో అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలి *- రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ. సాధికారత, సంబంధాల మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్* ఎపిఎస్పీ విభాగంలో స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ళుగా ఎంపికై, విజయనగరం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో తొమ్మిది మాసాల శిక్షణ పూర్తి చేసుకొని, సుశిక్షుతులైన పోలీసు కానిస్టేబుళ్ళ పాసింగ్ ఔట్ పరేడ్ సెప్టెంబరు 29న పోలీసు పరేడ్ గ్రౌండులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ. సాధికారత, సంబంధాల శాఖామంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు ముఖ్య అతిధిగా హాజరై, శిక్షణ కానిస్టేబుళ్ళు నుండి గౌరవ వందనం స్వీకరించి, పెరేడ్ ను ఆద్యంతం ఆశక్తిగా తిలకించారు. రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ. సాధికారత, సంబంధాల మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ – లయబద్ధమైన పరేడ్ ప్రదర్శన మీ తొమ్మిది మాసాల కఠోర శిక్షణను ప్రతిబింబించిందని, పోలీసు శిక్షణలో మీరు నేర్చుకున్న క్రమశిక్షణ, అంకితభావం, ఆయుధాల వినియోగం, చట్టాలపట్ల అవగాహన, ఫిజికల్ ఫిట్నెస్ మీ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందన్నారు. పోలీసు శిక్షణకు సాధారణ యువకుడిగా శిక్షణ కేంద్రంకు వచ్చి, కఠోర శిక్షణ పూర్తి చేసుకొని, అన్ని రంగాల్లో సుశిక్షులైన పోలీసు కానిస్టేబుళ్ళుగా విధులను నిర్వహించేందుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. పోలీసు యూనిఫారం అనేది ప్రభుత్వ బాధ్యత, క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తుందని, శిక్షణ సమయంలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో అమలు చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు, వి.ఐ.పి.ల భద్రత, అత్యవస సమయాల్లో నిర్వహించాల్సిన విధులను న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. విధుల నిర్వహణలో ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూనే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారితోను, అసాంఘిక శక్తులతో కఠినంగా వ్యవహరించాలన్నారు. అవసరమైన సందర్భాల్లో మానవత్వంతో వ్యవహరించాలని, నీతి, నిజాయతీతో పని చేయాలని శిక్షణ పొందిన కానిస్టేబుళ్ళుకు సూచించారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – తొమ్మిది మాసాల పోలీసు శిక్షణ పూర్తి చేసుకున్న ఎపిఎస్పీ కానిస్టేబుళ్ళుకు, పాసింగ్ ఔట్ పరేడ్ ను తిలకించేందుకు వచ్చిన వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. పరిపూర్ణమైన పోలీసులుగా రాష్ట్ర పోలీసుశాఖలో విధులు నిర్వహించడానికి సిద్ధం కావడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల పాత్ర తగ్గినప్పటికి, పోలీసుశాఖకు సైబరు నేరాలు రూపంలో మరో సవాలు ఎదురవుతుందన్నారు. సైబరు నేరాలను నియంత్రించేందుకు శిక్షణ సమయంలోనే సైబర్ క్రైం ఇన్వెస్టిగేషను పట్ల శిక్షణ కానిస్టేబుళ్ళుకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మీరంతా సైబర్ నేరాల నియంత్రణలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉండాలని శిక్షణ కానిస్టేబుళ్ళుకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు. అదేవిధంగా సి.సి.టి.ఎన్.ఎస్. మీద కూడా ప్రతేక శిక్షణ ఇచ్చినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. డిపిటిసి ప్రిన్సిపాల్, ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత మాట్లాడుతూ 198 కానిస్టేబుళ్ళు డిపిటిసిలో శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు. ప్రస్తుత పోలీసింగుకు అవసరమైన శిక్షణను ఇవ్వడం జరిగిందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెంది, ఉన్నత విద్యను అభ్యసించిన వారు కూడా ఉన్నారన్నారు. శిక్షణలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రేహౌండ్స్, ఆక్టోపస్, స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సైబర్ క్రైం ఇన్వెస్టిగేషను సెల్లో పనిచేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. కఠోర పోలీసు శిక్షణలో బెస్ట్ ఇన్డోర్, ఔట్ డోర్ విభాగాల్లో ప్రతిభ కనబరిచి, బెస్ట్ ఆల్ రౌండర్ గా నిలిచి, పరేడ్ కమాండర్ గా వ్యవహరించిన జోలాపురం దేవా నాయుడుకు రాష్ట్ర మంత్రివర్యలు బహుమతులను ప్రధానం చేసారు. అదే విధంగా బెస్ట్ ఔట్ డోర్ విభాగంలో షేక్ ఫక్రూద్దీన్, బెస్ట్ ఫైరర్గా తనిగుండల చంద్రశేఖర్ రెడ్డిలకు మంత్రివర్యులు బహుమతులను ప్రధానం చేసారు. పాసింగ్ ఔట్ పరేడ్ ను పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ప్రత్యేకంగా అలంకరించిన పోలీసు వాహనంలో తీసుకొని వెళ్లగా, కవాతును పోలీసు కుటుంబ సభ్యులు, విద్యార్థుల హర్ష ధ్వనుల మధ్య ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5వ బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్ రెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘువర్మ, కావలి గ్రీష్మ, గాదె శ్రీనివాసుల నాయుడు, 16వ బెటాలియన్ కమాండెంట్ అనిల్ కుమార్ పులిపాటి, మెరైన్ ఎస్పీ శ్రావణి, ఎఆర్ అడిషనల్ ఎస్పీ పి.కిరణ్ కుమార్, డిపిటిసి డిఎస్పీ పి.నారాయణ రావు, డిఎస్పీలు ఎస్.రాఘవులు, పి.వి.వి.నర్సింహా రావు, ఎం.వీరకుమార్, ఆర్.గోవిందరావు, ఇతర పోలీసు అధికారులు, శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు కానిస్టేబుళ్ళు, తల్లిదండ్రులు, వారి ఇతర కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చిన్న శ్రీను గారు, కుమార్తె సిరి సహస్ర*