ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్మించాలి

ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్మించాలి




        ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని జోడిస్తూ టిడిపి క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ఖండిస్తూ శుక్రవారం పార్వతీపురం స్థానిక సుందరయ్య భవనం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి, కాంప్లెక్స్ కూడలి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు ఏం.కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన చేపడుతుందని ఇది ప్రభుత్వ అస్మార్థతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేట్ కరించే భాగంలోనే టిడిపి క్యాబినెట్ నిర్ణయం చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్యను దూరం చేసిందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మోడీ నిర్ణయాలను వ్యతిరేకించి రాష్ట్ర ప్రజల నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ కొత్తగా మంజూరైన వైద్య కళాశాలల నిర్మాణాన్ని, నిర్వహణను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేపట్టాలని కోరారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా వైద్య కళాశాలల్లో సీట్లు పెంచేందుకు జాతీయ వైద్య మండలిపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన వైద్య కళాశాలలను పిపిపి విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. ప్రజల ఆరోగ్య హక్కును పరిరక్షించడంలో ప్రభుత్వ జవాబుదారీతనంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. మరోవైపు ప్రైవేటు వైద్య కళాశాలల్లో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిని సిబిఐ ఇటీవల బహిర్గతం చేసిన నేపథ్యంలో ప్రజాప్రయోజనాలను కాపాడటానికి ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిపిఎం ఈ విషయంపై అనేక పర్యాయాలు తన ఆందోళనను వ్యక్తం చేసిందన్నారు. జాతీయ, రాష్ట్ర నిపుణులు, మేధావులు, ప్రజలు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. వైద్య విద్యను ప్రైవేటీకరించడం వల్ల పేదల వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మిగిలిపోతుందన్నారు. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ వైద్య కళాశాలల నియంత్రణను అప్పగించడం వల్ల ఫీజులు అధికమవడం, జవాబుదారీతనం తగ్గడం, సేవ కంటే ఆదాయానికే ప్రాధాన్యత ఇవ్వడంతో పేద విద్యార్థులకు విద్య, రోగులకు వైద్యం అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.వై.నాయుడు, జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ, బి.వి.రమణ, రెడ్డి వేణు, కొల్లి సాంబమూర్తి, రెడ్డి శ్రీదేవి, కోరాడ ఈశ్వరరావు, మర్రి శ్రీను మరియు బి.సూరిబాబు, సింహాచలం, రాము, రెడ్డి ఈశ్వరరావు, ఎం.ఉమామహేశ్వరి, బి.లక్ష్మి, జి.తులసి, రాము తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి