చీపురుపల్లి,
జిల్లాలో సమగ్ర త్రాగునీటి పథకాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ ఉద్యోగులకు చాలా ఏళ్లుగా నెలకొన్న వేతనాలు సమస్య విజయనగరం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున చొరవతో పరిష్కారమైంది. జిల్లాలో సమగ్ర తాగునీటి పథకాల్లో దాదాపు 1000 మంది థర్డ్ పార్టీ కింద చాలా ఏళ్లుగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి ప్రభుత్వ SSR రేటు ప్రకారం నెలకు రూ.18000 నుంచి రూ.20,000 వేతనం చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.6000 నుంచి రూ.8000 చెల్లిస్తున్నారు. అరకొర వేతనంతో సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సేవలందిస్తున్నారు. ఈనెల 17న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జునను చీపురుపల్లిలోని ఆయన నివాసంలో జిల్లా సంఘం నాయకులు, సిబ్బంది నాగార్జునను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన నాగార్జున జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు.
కలెక్టర్ స్పందించి సంబంధిత గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో మాట్లాడి వేతనాల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో తాగునీటి పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి నెలకు రూ.3000 చెప్పున వేతనం పెంపుదలు చేశారు. దీనికి ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తూ నాగార్జునను చీపురుపల్లిలో ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. మీ చొరవతో మా సమస్య పరిష్కారమైందంటూ ఆనందం వ్యక్తం చేశారు.