వారు ఏమైపోయారు

వారు ఏమైపోయారు





విమాన ప్రమాదం తరువాత పలువురి ఆచూకీ గల్లంతు
అహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌ విమానప్రమాద ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఆ ప్రమాదంలో చిక్కుకున్న పలువురు మెడికోలతో పాటు ఇతరుల ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 12న గాలిలోనే పేలిపోయిన ఎయిర్‌ ఇండియా విమానం బిజె మెడికల్‌ కళాశాల హాస్టల్‌ పైన కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హాస్టల్‌లో ఉన్న కూడా 30 నుండి 35 మండి మెడికోలు కూదా ప్రమాదంలో చిక్కుకున్నారన్న వార్తలు వచ్చాయి. సోమవారం నాటికి వీరిలో ఎనిమిది మృత దేహాలను మాత్రమే అధికారులు సమీప బంధువులకు అప్పగించారు. మిగిలిన వారి గురించి సందిగ్థత ఇంకా కొనసాగుతోంది. ఆ ప్రమాదంలో మెడికోలతో పాటు, ఇతరులు ఎందరు చిక్కుకున్నారు? వారిలో ఎంత మంది క్షేమంగా ఉన్నారన్న విషయమై ఇంతవరకు ఆ జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ప్రమాదం జరిగిన రోజు నుండి కొందరు మెడికోలతో పాటు, పలువురు స్థానికుల ఆచూకీ తెలియడం లేదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి, వీరిలో కొందరు పోలీసు స్టేషన్లలో కేసులు పెడుతుండగా, మరికొందరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
అదే సమయంలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, వాటిని వారి బంధువులకు అప్పగించామని అధికారులు చెబుతుండటం స్థానింగా చర్చనీయాంశమైంది. కనపడకుండా పోయిన వారి పరిస్తితి ఏమిటన్న ప్రశ్నకు జవాబు చెప్పడం లేదు. నలుగురు మెడికోల తల్లితండ్రులు తమ పిల్లల ఆచూకీ తెలియడం లేదంటూ అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. హాస్టల్‌లోని టాప్‌ ఫ్లోర్‌లో ప్రమాదం జరిగిన రోజు వారిని చూసినట్లు కొందరు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ప్రమాదంలో వీరు కూడా చిక్కుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న తమ బంధువుల పిల్లలను చూడటానికి వచ్చిన ఒక డాక్టర్‌ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. హాస్టల్‌ వంటమనిషి సరియాతో పాటు, ఆమె మనవరాలు ఆరాధ్య కూడా ప్రమాదం జరిగిన రోజు నుండి కనపడటం లేదన్న ఫిర్యాదు స్తానిక పోలీస్‌ అధికారులకు అందింది.

ఫిల్మ్‌ మేకర్‌ కూడా…

మహేష్‌ జిర్వాల్అనే స్థానిక ఫిల్మ్‌మేకర్‌ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిసింది. ఐదు రోజులుగా ఆచూకీ కనపడకపోవడంతో, ఆయన కుటుంబ సభ్యులు డిఎన్ఎ టెస్ట్‌కు నమూనాలు ఇచ్చారు. సంఘటన జరిగిన రోజు ప్రమాద స్థలానికి 700 మీటర్ల దూరంలో ఆయన మొబైల్‌ ఫోన్‌ చివరిసారిగా పనిచేసినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన కూడా ఈ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

చాయ్ వాలా కూడా…

మెడికల్‌ హాస్టల్‌కు సమీపంలో టీ షాపు నడుపుతున్న ఒక చాయ్ వాలా కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. హాస్టల్‌లోకి కూడా ఆయన టీ సరఫరా చేస్తుంటారు. ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు ఆయన్ని చూసినట్లు కొందరు చెబుతున్నారు. ప్రమాదపు హడావిడిలో ఆ రోజంతా ఆయన గురించి పట్టించుకోలేదని, మరుసటి రోజు నుండి ఆయన కనపడటం లేదని అంటున్నారు. ఈ తరహాలో మరో నాలుగైదు ఫిర్యాదులు కూడా స్థానికంగా వినపడుతున్నాయి. అధికారయంత్రాంగం మాత్రం వీటిపై పెదవి విప్పడం లేదు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి