ఆర్ధిక స్వాతంత్య్రం తోనే మహిళలు ఆర్ధికంగా వృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఒకరిపై ఆధారపడకుండా తమకు తాము సంపాదించిన డబ్బులతో అవసరాలను తీర్చుకోవడమే ఆర్ధిక స్వాతంత్య్రం అని పేర్కొన్నారు. ఎవరిపై ఆధారపడనప్పుడే అనుకున్నవి సాధించగలరని, విజ్ఞానంతో పాటు సంపాదించుకునేందుకే చదువు అని విద్యార్థులకు కలెక్టర్ ఉద్బోదించారు. డిగ్రీ సాధించేలోగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగంలో చేరి, సంపాదనను ఆర్జించాలని, అంతవరకూ వివాహం చేసుకోరాదని హితవు పలికారు.

శనివారం పాచిపెంట మండలం పి.కోనవలసలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో వ్యక్తిగత అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై విద్యార్థినులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తుకు వ్యక్తిగత అవగాహన అవసరమని అన్నారు.  నిత్యం వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన సూచించారు. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో లేదా అపరిశుభ్రంగా ఉంటే వారికి సున్నితంగా సంకేతాల ద్వారా తెలియజేసి సరిదిద్దాలని సూచించారు. చదువుతో పాటు శారీరక శ్రమ, నృత్యం వంటి కళల్లో కూడా విద్యార్థినులు చురుగ్గా పాల్గొనాలని, అప్పుడే మానసిక ఉల్లాసం లభిస్తుందని పేర్కొన్నారు. 16 ఏళ్ల వయసులో ఎల్లప్పుడూ ఉత్సాహంగా, చురుగ్గా కనిపించాలని, నిస్తేజంగా ఉండరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని అన్నారు.  కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా, సమాజంలో ఎలా మెలగాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని ఉపాధ్యాయులకు,  విద్యార్థినులకు సూచించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన చర్యలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల నివారణకు ఉద్దేశించిన పోక్సో చట్టంపై విద్యార్థులకు ఉపాధ్యాయులతో వివరించారు. మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి అందుబాటులో ఉన్న పోలీసు సేవలు, భద్రతా యాప్‌లను వినియోగించుకోవాలని అన్నారు. ఆపదలో ఉన్న మహిళలు, పిల్లలకు అండగా నిలిచే ‘వన్ స్టాప్ సెంటర్’ సేవలు, ‘మిషన్ వాత్సల్య’ పథకం ద్వారా అందుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాన్ని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది,  విద్యార్థినులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి