వందేమాతరం స్వరాల్లో దేశభక్తి ప్రతిధ్వని 150 ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని స్మరించుకున్న సాలూరు శిశు మందిర్ విద్యార్థులు దేశభక్తి భావాన్ని తరతరాలకు అందించిన ‘వందేమాతరం’ గీతం 150 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని సాలూరు సరస్వతి శిశు మందిర్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకే స్వరంగా వందేమాతరం ఆలపిస్తూ జాతీయ స్ఫూర్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించిన వందేమాతరం గీతం భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మక్కువ రిటైర్డ్ ఎంఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ గీతం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం, స్వాతంత్ర్య సమరంలో దాని పాత్రను విద్యార్థులకు వివరించారు. దేశభక్తి అనేది మాటల్లోనో, నినాదాల్లోనో మాత్రమే పరిమితం కాకుండా మన ప్రవర్తనలో ప్రతిబింబించాలని ఆయన అన్నారు. క్రమశిక్షణ, బాధ్యత, దేశ చట్టాల పట్ల గౌరవం, పరిసరాల పరిశుభ్రత, సమాజం పట్ల బాధ్యత వంటి విలువలను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ, దేశ భవిష్యత్తును నిర్మించే బాధ్యత తమదేనన్న భావనతో విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యతో పాటు దేశం పట్ల అవగాహన, సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు సామూహికంగా ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు. చిన్నారుల స్వరాల్లో వినిపించిన వందేమాతరం నినాదాలు పాఠశాల ప్రాంగణంలో జాతీయ స్ఫూర్తిని నింపాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.. Spread the love టపా నావిగేషన్ అక్షరాల నుండి అభినయం వరకూ.. హిందీలో మెరిసిన వల్లాపురం విద్యార్థులు