సాలూరు మున్సిపల్ పీఠంపై జనసేన గురి.. అభ్యర్థి ఎంపికపై నాగబాబు కీలక వ్యాఖ్యలు!

కౌన్సిలర్ అభ్యర్థుల్లో జోష్ నింపేందుకు సాలూరుకు ఎమ్మెల్సీ రాక.. త్వరలోనే చైర్‌పర్సన్ అభ్యర్థి ఖరారు

సాలూరు: సాలూరు మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన పార్టీలో రాజకీయ సందడి నెలకొంది. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి జనసేనకు కేటాయించిన నేపథ్యంలో, ఆ పీఠాన్ని దక్కించుకునే దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఏపీ గ్రీన్ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, కేబినెట్ హోదా కలిగిన శాసనమండలి సభ్యుడు నాగబాబు సాలూరులో పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్టీ కోఆర్డినేట్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడంతో పాటు ముఖ్య నాయకులతోనూ నాగబాబు చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, కౌన్సిలర్ అభ్యర్థుల సన్నద్ధత, స్థానికంగా పార్టీ బలాబలాలపై నాయకులతో సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహంగా ఉన్న నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవడమే తన పర్యటన ముఖ్య ఉద్దేశమని నాగబాబు స్పష్టం చేశారు.

ఆశావహులతో సందడి.. చేరికలపై ఆసక్తి

సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం జనసేనకు కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ఆశావహులు జనసేనలో చేరేందుకు, కౌన్సిలర్ టికెట్లతో పాటు చైర్‌పర్సన్ అభ్యర్థిత్వంపై తమ ఆసక్తిని తెలియజేసేందుకు ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాగబాబు పర్యటనతో సమావేశ ప్రాంగణం నాయకులు, కార్యకర్తలు, ఆశావహులతో సందడిగా మారింది.

ఇదే సమయంలో పార్టీ సమన్వయ సమావేశం నిమిత్తం సాలూరుకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర మంత్రి సంధ్యారాణి నాగబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల నేపథ్యంలో ముఖ్య నాయకుల పరస్పర భేటీలు స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కార్యకర్తలకు అండగా ఉంటాం.. నాగబాబు భరోసా

సమావేశాల అనంతరం నాగబాబు మాట్లాడుతూ, సాలూరులో జనసేన తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వారంతా ఎంతో ఉత్సాహంతో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు.

“మా వాళ్లందరూ కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఉత్సాహంగా, బలంగా పోరాడుతున్నారు. మంచి మంచి కార్యకర్తలు పార్టీలో ఉన్నారు. వారందరినీ ఒకసారి పలకరించి, ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ప్రోత్సహించడానికి, వారికి సహకారంగా ఉండేందుకు ఇక్కడికి వచ్చాను. పార్టీ శ్రేణులకు అండగా నిలవడమే నా ఉద్దేశం” అని నాగబాబు పేర్కొన్నారు.

సరైన వ్యక్తికే అవకాశం.. త్వరలో నిర్ణయం

సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని జనసేనకు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించిన నాగబాబు, ఈ పదవికి తగిన వ్యక్తిని త్వరలోనే నిర్ణయిస్తామని వెల్లడించారు. “సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం మాకు ఇచ్చారు. సరైన వ్యక్తిని త్వరలోనే నిర్ణయించుకుంటాం” అని తెలిపారు.

నాగబాబు వ్యాఖ్యలతో చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ మరింత పెరిగింది. కౌన్సిలర్ స్థానాల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న వేళ, పార్టీ నాయకత్వం ఎవరికి అవకాశం కల్పిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపిక, వార్డులవారీగా అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ప్రచార వ్యూహాలపై జనసేన తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్థానిక రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి