సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం



అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

సిపిఎం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మోహన్, వై.చిన్నారావు, సిహెచ్. హారిక అనే ముగ్గురు కార్మికులు మరణించారు. మరణించిన ఒక్కొక్క కార్మికుని కుటుంబానికి కోటి రూపాయాలు పరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులైన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

అచ్యుతాపురం ఎస్ఐజెడ్లోని ఎసెన్షియా ఫార్మాలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా సుమారు 22 మందికి పైగా కార్మికులు క్షతగాత్రులయ్యారు. అనేక మంది కార్మికులకు కాళ్లు, చేతులు విరిగిపోవడమే కాకుండా తలకు బలమైన గాయాలు కూడా అయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా వుందని తెలుస్తుంది. ఫార్మా పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత లేకుండా పోతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కమిటీల పేరుతో హడావడి చేస్తున్నారు. కంపెనీల్లో ఉన్న లోపాలపై నిరంతరం తనిఖీలు చేయడంలేదు. ఇన్ని ప్రమాదాలు సంభవిస్తున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీస్ ఆప్ ఇన్స్పెక్టర్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఇటీవల జిల్లా కలెక్టర్ గారు పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించిన నెల రోజుల్లోనే మూడు ప్రమాదాలు సంభవించాయంటే రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులపట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్ధమౌతుంది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ప్రమాదాలకు కారణమైన కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే తరుచూ ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలో కూడా పరవాడ, అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదాలపై అధికార యంత్రాంగంతో కమిటీలు వేసి విచారణ నిర్వహించారు. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలు బహిర్గతం చేసి కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని వుంటే నేడు ఇలాంటి ప్రమాదాలు మరలా సంభవించేవికాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ప్రమాదాలకు కారణమైన కంపెనీపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *