కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసే దిశగా నిర్వహిస్తున్న యువమంథన్ లో భాగంగా, గరివిడి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాలలో 19-09-2024 (గురువారం) నాడు నమూనా ఐక్యరాజ్యసమితి (మోడల్ యూ.ఎన్) కార్యక్రమం నిర్వహించినట్టు కళాశాల అధిపతి, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ మక్కెన శ్రీను తెలియజేసారు.
ఇందులో భాగంగా కళాశాల విద్యార్ధులు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ నమూనాలో సమావేశం జరిపి, “మెరుగైన పర్యావరణం కోసం అనుసరించవలసిన జీవన శైలి” అనే అంశం పై చర్చ జరిపారు. ఇందులో పాల్గొన్న విద్యార్ధులు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ పర్యావరణ నిపుణులు, వివిధ దేశాల శాశ్విత ప్రతినిధులు గా వ్యవహరించి చర్చించారు. తాము ప్రాతినిధ్యం వహించే దేశాల పారిశ్రామిక విధానాలు, అంతర్జాతీయ సంస్థలద్వారా తమ దేశం ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు చేతున్న సేవ, తమ ప్రత్యర్ధి దేశాలు ఈ ప్రయత్నాలకు అడ్డం పడుతున్న తీరు పై ఆరోపణలు, తమ దేశంలో పెరిగుతున్న సోలార్ విద్యుత్ వినియోగం, తమ దేశప్రజల సమగ్ర ప్రయోజనాలు తదితర అంశాలు స్పృశించారు.
ఈ కార్యక్రమాన్ని కళాశాల విద్యార్ధి వ్యవహారాల అధికారి డా సుధారాణి సమన్వయం చేయగా, ఇతర అద్యాపకులు డా రవికుమార్, డా మురళిదహ్ర్, డా ఇక్బాల్ హైదర్, డా రాజీవ్ తదితరులు విద్యార్ధులకు మార్గదర్శనం, ప్రసంగాల రూపకల్పన, పదిరోజుల అభ్యాసం (రిహార్సలస్) తదితర భాద్యతలు నిర్వహించారు.
ఈ కార్యక్రమ వివరాలు, విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయానికీ, అలాగే కేంద్రప్రభుత్వ పథకం యువమంథన్ (న్యూడిల్లీ) వారికి కూడా సమర్పించారు.