*లైన్స్ క్లబ్ పుస్తకాల అమ్మకం ఆపాలి.*
• *ఎస్ఎఫ్ఐ డిమాండ్*
• సాలూరు స్కూల్ వద్ద పుస్తకాలతో ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా సాలూరు లోని పలు కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ నిలిచాయని, విచ్చలవిడిగా పుస్తకాల వ్యాపారం చేపడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి.అఖిల్ అన్నారు. గురువారం సాలూరు స్థానిక లైన్స్ క్లబ్ స్కూల్లో యాజమాన్యం పుస్తకాల విక్రయాలు చేపడుతుండడంతో, ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకున్నారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం తెలిపినప్పటి కీ స్పందించకపోవడంతో పుస్తకాలతో స్కూల్ బయట బైఠాయించారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం మునుపే కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యారంగాన్ని వ్యాపారంగా మలుచుకొనే ప్రయత్నాలు చేపడుతున్నారని ఇది చాలా దుర్మార్గమని మండిపడ్డారు. నాణ్యమైన విద్య పేరుతో యాజమాన్యులు వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని, తల్లిదండ్రుల రక్తాన్ని పట్టిపీడిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా తరగతి గధులు నిర్వహించడం చాలా దారుణమని అన్నారు. యాజమాన్యం పుస్తకాలు యూనిఫారం పేరుతో 20 వేల నుంచి 30 వేల రూపాయిల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. వీటిపై స్పందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులకు సమాచారం తెలిపినప్పటికీ పట్టించకపోవడం అన్యాయమని వాపోయారు. గతంలో పలు విద్యాసంస్థల్లో పాఠ్య పుస్తకాలు విక్రయాలు చేపడుతున్నాయని సమాచారం తెలిపిన ఎటువంటి స్పందన లేదని, అదే తీరు లయన్ క్లబ్ స్కూల్ పై కూడా విద్యాశాఖ అధికారులు అవలంబిస్తున్నారని ఇది ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దందా వెనుక జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుందని, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని, అలాగే విద్య హక్కు చట్టానికి వ్యతిరేకంగా పుస్తకాలు, యూనిఫార్మ్స్ అమ్మకాలు చేపడుతున్న విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు,కార్యదర్శి B. శరత్, సూర్య నారాయణ సాలూరు పట్టణ కమిటీ సభ్యులు శంకర్, ఉదయ్, ఎల్లిషా, తదితరులు పాల్గొన్నారు.




