పూర్వ విద్యార్థుల,
“అపూర్వ సమ్మేళనం” సాక్షిగా
బడిమిత్రుల సేవా ట్రస్ట్ కు శ్రీకారం




గరివిడి, విజయనగరం జిల్లా గరివిడిలోని పూర్వ శ్రీరాం హైస్కూల్ వేదికగా ఆ.. పూర్వ విద్యార్థుల “అపూర్వసమ్మేళనంలో” కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత, తాము చదివిన పాఠశాలలో 1986-87 బ్యాచ్ పూర్వ విద్యార్థులు, వినూత్న ఆలోచనకు తెరతీశారు. పరస్పర సహకారానికి ‘బడి మిత్రుల సేవా ట్రస్ట్’ ఏర్పాటు చేసుకుని బడి బంధంతో ఒకటైన వారంతా.. ఒకరికొకరు చేదోడువాదోడుగా నిలవాలని, ఇంకా పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించుకోవాలని, నిర్ణయించుకున్నారు. సుదూర ప్రాంతాల నుండి సైతం పూర్వ విద్యార్థులు విచ్చేసి ఆత్మీయ కలయికను ఒక పండగల నిర్వహించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, మేళ తాళాలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. దారి పొడవునా పూలను విసురుతూ.. మేళ తాళాలతో సభా వేదిక వద్దకు తీసుకు వెళ్లి, పూర్వ విద్యార్థులు అందించిన ఆత్మీయ సత్కారానికి, అప్పటి విశ్రాంత ఉపాధ్యాయులు ఆనందభాష్పాలు రాల్చి భావోద్వేగానికి లోనైన దృశ్యం ఈ కార్యక్రమంలో కనిపించింది. తమపై ఇంతటి ప్రేమాభిమానాలను చూపించిన పూర్వ విద్యార్థులను, ఆశీర్వదించిన నాటి గురువులు, ఈ ప్రేమాభిమానాలను పొందిన క్షణాలను జీవితాంతం మరువలేనివని అన్నారు. తమను ఉన్నతంగా తీర్చిదిద్దిన శ్రీరామ్ ఉన్నత పాఠశాల సాక్షిగా, తమకు దిశా నిర్దేశం చేసిన గురువుల సమక్షంలో, ‘బడి మిత్రుల’ సేవా సంస్థ ఏర్పాటు ఆలోచన రాగానే పూర్వ విద్యార్థులైన, ప్రముఖ వైద్యుడు డాక్టర్ పివి కృష్ణంరాజు, ప్రముఖ న్యాయవాది కారి గోవిందరాజు, ముందడుగు వేశారు. ఇక మిగిలిన మిత్రులు కూడా మేము సైతం అంటూ ముందుకు నడిపించడానికి తమ వంతు భాగస్వామ్యాన్ని ప్రకటించారు. తమ పాఠశాలలో గడిచిన అద్భుత దశాబ్దాలను గుర్తు చేసుకుంటూ.. ” అపూర్వ కలయిక” మిగిల్చిన, మధుర క్షణాలను కొత్త గమనాలకు మళ్ళించి… మళ్లీ కలుసుకుందాం అంటూ, ఒకరికొకరు వీడ్కోలు పలికారు ఆ… పూర్వ విద్యార్థులు.
